జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కనీస వసతులు కరవయ్యాయి. కొద్దిపాటి వర్షానికే కళాశాల చుట్టూ నీరు వస్తుండటంతో.... విద్యార్థులు, ఆధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండ్రోజులపాటు కురిసిన వర్షానికి కళాశాల భవనం చుట్టూ వరద నీరు చేరి చెరువును తలపిస్తోంది. ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు జరుగుతుండగా.. విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. మురుగు నీటిని దాటుకొని వచ్చి పరీక్షలు రాస్తున్నారు.
నిర్మాణాలు అసంపూర్తిగానే..
ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని 2016లో ప్రారంభించారు. అయినా....ఇప్పటికీ నిర్మాణాలు అసంపూర్తిగానే ఉన్నాయి. కళాశాల చుట్టూ ఎత్తైన కొండలు ఉండడంతో.... వర్షం పడిన ప్రతిసారి పైనుంచి వరద రావటంతో.... భవనం చుట్టూ నీరు నిలుస్తోంది. ప్రతి ఏడాది ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు తెలిపారు. భవనం పైపెచ్చులు ఊడి పడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. గోడలకు పగుళ్లు రావడంతో తరగతి గదుల్లోకి వర్షం నీరు వస్తుందని తెలిపారు. ప్రస్తుతం పరీక్షల సమయంలో... నానా కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఐదో సెమిస్టర్ రాస్తున్నప్పుడు వర్షం పడి, కళాశాల అంతా మునిగింది. ఓఎంఆర్ షీట్లన్ని తడిచిపోయాయి. కాలేజ్ మొత్తం చెరువులా మారుతోంది. - డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థి.
ప్రభుత్వ డిగ్రీ కాళాశాలలో ఎలాంటి సౌకర్యాలు కూడా మాకు సక్రమంగా లేవు. కాలేజ్ లోపలికి రావడానికి కూడా చుట్టూ అంతా నీరు. ఎగ్జామ్ హాల్లో కూడా పై నుంచి నీరు కారడం వల్ల మేము సరిగా పరీక్ష రాయలేకపోయాం - పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థి.