హుజూరాబాద్ ఉప ఎన్నికలో(Huzurabad By Election 2021) సర్వశక్తులను ఒడ్డేందుకు ప్రయత్నిస్తున్న ప్రధాన పార్టీలకు బరిలో ఉన్న స్వతంత్రుల రూపంలో ఊహించని ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే ఆయా పార్టీల మధ్య నువ్వా-నేనా అనేలా విజయవకాశాలున్నాయనే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఏకంగా 20 మంది స్వతంత్రులు బరిలో నిలిచి ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో గుబులు రేకెత్తిస్తున్నారు. గెలుపు కోసం ప్రతి ఓటును కూడగట్టుకుంటున్న పోటీదారులకు గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లుగా స్వతంత్రులు, చిన్నపార్టీల అభ్యర్థులు తయారయ్యారు. ఇక్కడి అభ్యర్థుల గెలుపు ఓటములపై వీరికి వచ్చే ఓట్లు ఆధారపడి ఉంటాయనే మాటల్ని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు వినిపిస్తున్నారు. వీరు చీల్చే ఓట్ల వ్యత్యాసం ఎవరికి శాపంగా మారుతుందనేది ప్రధాన పార్టీ నేతల్లో ఆందోళనను పెంచుతోంది.
రికార్డు స్థాయిలో..
ఇక్కడి నియోజకవర్గ(Huzurabad By Election 2021) చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మొత్తంగా 30 మంది అభ్యర్థులు ఈసారి తలపడుతున్నారు. ఇందులో మూడు ప్రధాన పార్టీల అభ్యర్ధులవగా మిగతా ఏడుగురు రిజిస్టర్డ్ పార్టీతరఫున రంగంలో నిలిచారు. వీరే కాకుండా స్వతంత్రులు ఏకంగా 20 మంది సమరానికి సై అంటున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లో ఎప్పుడు ఇతర చిన్న పార్టీలు, స్వతంత్రులు పోటీ చేసినా అంతగా గెలుపు ఓటముల్ని ప్రభావితం చేయలేదు. కానీ ఈసారి పోటాపోటీగా మారుతున్న ఇక్కడి ఉప సమరంలో వీరందరు సాధించే ఓట్లు ప్రధాన పార్టీల అభ్యర్థుల విజయావకాశాల్ని తారుమారు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 2009లో 14 మంది పోటీ చేయగా ఇందులో ఇద్దరు, ముగ్గురు స్వతంత్రులు 6,054 ఓట్లను సాధించారు. 2014లో 9 మంది పోటీలో నిలువగా ఇందులో చిన్నపార్టీవారున్నారు. స్వతంత్రులు ఒక్కరు లేరు. 2018లో మొత్తంగా 10 మంది తలపడగా అందులో ఇద్దరు ముగ్గురు స్వతంత్రులు మోస్తారుగా ఓట్లను పొందగలిగారు. ఈసారి మాత్రం వీరి జాబితా అధికంగా ఉండటంతో ఓటర్లు ఎవరికి ఎంతగా మద్దతును తెలుపుతారనేది ఎన్నికల రోజు తెలియనుంది. పైగా ప్రచారాలకు కూడా వీరి సిద్ధమవుతుండటంతో ఓట్ల చీలిక మాత్రం ఖాయమనిపిస్తోంది.
‘గుర్తు’ చేస్తున్నారు..!
ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచార పర్వాన్ని సరికొత్త సవాలుగానే స్వీకరిస్తున్నారు. ఓటర్లకు తమ ప్రాధాన్యంను తెలియజెప్పుతూనే ముఖ్యంగా తమ గుర్తును పదే పదే గుర్తుచేస్తున్నారు. రెండు ఈవీఎం బ్యాలెట్‌లలో క్రమ సంఖ్య సహా ఇతర ఆధారాల్ని చూపిస్తున్నారు. పోటీచేస్తున్న వారిలో చాలామంది ఒకే తరహా పోలిక ఉన్న గుర్తులను ఎంపిక చేసుకోవడంతో ఇది ఓట్ల పరంగా కొత్త చిక్కులకు దారితీస్తోంది. దీంతో ఆచి తూచి అభ్యర్థులు ఓటర్లకు గుర్తును పదేపదే చెబుతున్నారు. ఎక్కువ సంఖ్యలో అభ్యర్థుల కారణంగా రెండు ఈవీఎంలలో వీరి వివరాలుండటంతో నిరక్షరాస్యుల ఓట్లు ఎవరికి పడుతాయనే సందేహం అందరిలో ఉత్పన్నమవుతోంది. ముఖ్యంగా ప్రధాన పార్టీల తరపున పోటీ చేసే వారికి ఇది తలనొప్పి వ్యవహారంగానే మారిందనే మాటలు ఆయా పార్టీల్లో వినిపిస్తున్నాయి. మరోవైపు అభ్యర్థుల సంఖ్య పెరుగుదలకు అనుగుణంగా ఎన్నికల వ్యయం కూడా పెరగనుంది. అభ్యర్థులకు గుర్తింపులు, అనుమతులు, పోలింగ్ ఏజెంట్ల నియామకాలు మొదలగు పనిభారం కూడా ఎన్నికల అధికారులకు తప్పడంలేదు. ఇందుకు తగినట్లుగా పోలింగ్ సహా లెక్కింపు రోజున కూడా యంత్రాంగంపై ఒత్తిడి పెరిగే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు.