వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ కోసం 100రోజుల ఎదురుచూపులకు వారికి నిరాశే మిగిలింది. ధరణి పోర్టల్ ఏర్పాటులో భాగంగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు నిలిపివేసినా కోర్టు ఉత్తర్వులతో పాతపద్దతిలోనే తిరిగి ప్రారంభించింది. ప్రతిరోజూ 24 మందికి రిజిస్ట్రేషన్లు చేసుకొనేందుకు వీలుగా వెసులుబాటు కలిపించింది. ఇంటి నిర్మాణం కోసం రుణాలు, గిఫ్ట్‌డీడ్ చేయించుకోవాలని ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వ ప్రకటనతో ఊరట లభించింది. అయితే ఎల్ఆర్‌ఎస్ పూర్తైన ప్లాట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
ఎదురుచూపులు..
రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 31 నాటికి 25.59 లక్షల మంది క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 12వేల గ్రామపంచాయతీల పరిధిలో 10లక్షలకుపైగా, 141 మున్సిపాలిటీల్లో 10.83 లక్షల మంది రూ. 10వేలు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు స్వీకరించినా ఇప్పటి వరకు వాటిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తమ దరఖాస్తు ఏ స్థాయిలో ఉందనే విషయం వెబ్సైట్లో తెలుకునేందుకు కూడా వీలు లేదు. కరీంనగర్ జిల్లాలో 40,775 మంది, జగిత్యాలలో 25,991, పెద్దపల్లిలో 19,265, సిరిసిల్లలో 27, 372 మంది ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. తమ అవసరాల నిమిత్తం ఉన్న ప్లాట్లు విక్రయించాలని భావిస్తున్నా లే-అవుట్ క్రమబద్ధీకరణ పూర్తి కాకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.