ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం (Kaleshwaram) ద్వారా మూడో టీఎంసీ ఎత్తిపోతలకు సన్నాహాలు చేస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ (SRSP) వరద కాలువకు సమాంతరంగా మరో కాలువ నిర్మాణం చేపట్టనున్నారు. దీనికోసం కరీంనగర్ జిల్లా రామడుగు, గంగాధర, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలాల్లోని భూములు సేకరించే ప్రక్రియ ప్రారంభం కావడంతో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే రెండు సార్లు భూములు కోల్పోయిన వారు ఇప్పుడు వారి భూములు, ఇళ్లు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు.
ఎంత కోల్పోతే అంతే..
తమ భూములు ఇవ్వబోమని.... కాల్వను మరో చోటు నుంచి తీసుకెళ్లాలని కోరుతున్నారు. ఒకవేళా ఇక్కడి నుంచే కాల్వ తీయాలనుకుంటే... భూమి ఎంత కోల్పోతే అంతే విస్తీర్ణంలో గ్రామ శివారులో స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు కట్టివ్వాలని కోరుతున్నారు. భూమికి భూమి ఇవ్వలేని పక్షంలో... 20ఏళ్ల తర్వాత ఆ భూములకు ఎంతైతే ధర ఉంటుందో అంచనా వేసి ఆ మొత్తం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.