కరీంనగర్లో ఆదివారం రోజున భారీ వర్షం(Heavy rain in karimnagar) కురిసింది. నగరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి మురుగు నీరు చేరి చెరువును తలపించాయి. విద్యానగర్, రాంనగర్, జ్యోతి నగర్, ముకరంపుర, శ్రీనగర్ కాలనీల్లోని ప్రధాన రహదారులు నీటమునిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శాతవాహన యూనివర్సిటీ రోడ్డులో సెయింట్ జాన్స్ పాఠశాల ఎదురుగా ఉన్న ఇళ్లు, దుకాణాల్లోకి వరద నీరు రావడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ముకరంపుర, సిరిసిల్ల బస్ స్టాప్ ఎదురుగా డ్రైనేజీ నీరంతా రోడ్డు పైకి వచ్చింది. భగత్‌నగర్ కట్ట, రాంపూర్ వీధులు జలమయమయ్యాయి. సిరిసిల్ల రోడ్డులోని పద్మా నగర్, రామ్ నగర్ ప్రధాన రహదారిపై నీరు నిలవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్మార్ట్ సిటీ పనులు అసంపూర్తిగా వదిలేయడం వల్ల, మురుగునీటి కాలువలు అనుసంధానం చేయకపోవడం వల్లే ఈ సమస్యలు తలెత్తాయని స్థానికులు ఆరోపించారు.
లోతట్టు ప్రాంతాలను కరీంనగర్ నగర పాలక మేయర్ సునీల్ రావు.. కమిషనర్ అగర్వాల్‌తో కలిసి పరిశీలించారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడం వల్లే మురుగు కాలువలు పొంగిపొర్లి రహదారులపై నీరు చేరిందని మేయర్ అన్నారు.