తెలంగాణ

telangana

ETV Bharat / city

Bandi Sanjay: బండి సంజయ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ - jp nadda on bandi sanjay arrest

bandi sanjay
bandi sanjay

By

Published : Jan 3, 2022, 2:44 PM IST

Updated : Jan 4, 2022, 6:31 AM IST

14:42 January 03

బండి సంజయ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

Bandi Sanjay: ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317ను సవరించాలని డిమాండ్‌ చేస్తూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కరీంనగర్‌లో చేపట్టిన జాగరణ దీక్ష అనంతర పరిణామాలు ఆయన జ్యుడిషియల్‌ రిమాండ్‌కు దారితీశాయి. సోమవారం పోలీసులు సంజయ్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి న్యాయస్థానంలో హాజరుపరచగా.. 14 రోజులు రిమాండ్‌కు తరలించాలని కరీంనగర్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆదేశించారు. దీంతో సంజయ్‌ని కరీంనగర్‌ జిల్లా జైలుకు తరలించారు. భాజపా ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్‌లో సంజయ్‌ తలపెట్టిన జాగరణ దీక్ష ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సందర్భంగా తనతోపాటు విధుల్లో ఉన్న మరో 11 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని హుజూరాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.శ్రీనివాస్‌ ఇచ్చిన ఫిర్యాదుతో సంజయ్‌, మరో 16 మందిపై 8 సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు. సంజయ్‌ సహా ఆరుగురిని కోర్టులో హాజరుపరిచారు. మిగతా 11 మంది పరారీలో ఉన్నట్లు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.
ఎలాంటి అనుమతులు లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించడం, కొవిడ్‌ నిబంధనల్ని ఉల్లంఘించి.. విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకుని ఆస్తినష్టాన్ని కలిగించారని, ఇందుకు సంజయ్‌తోపాటు మరికొందరు కారణమని కరీంనగర్‌ రెండో ఠాణా పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఇందులో సంజయ్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొనడంతోపాటు గతంలో ఈయనపై ఉన్న 10 కేసులనూ రిమాండ్‌ నివేదికలో ప్రస్తావించారు.

ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారంటే..

సీసాలు, కర్రలతో గాయపరచడమే కాకుండా అక్కడే ఉన్న పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసి సుమారు రూ.20 వేల ఆస్తి నష్టం కలిగించారని, జాతీయ విపత్తు నిర్వహణ చట్టంలోని నిబంధనల్ని ఉల్లంఘించారని పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమంగా నిర్వహించే సమావేశంలో సభ్యుడిగా ఉన్నారంటూ ఐపీసీ సెక్షన్‌ 143, శాసన సమ్మతంగా జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ సెక్షన్‌ 188, అక్రమంగా ఒక వ్యక్తిని నిరోధించారని సెక్షన్‌ 341, ప్రజాసేవలో ఉన్న ఉద్యోగి విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్నారంటూ సెక్షన్‌ 332, విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకుని తీవ్రంగా గాయపరిచారంటూ సెక్షన్‌ 333లను బండి సంజయ్‌పై నమోదు చేశారు. అందరూ కలిపి నేరం చేశారని సెక్షన్‌ 149, జాతీయ విపత్తు చట్టంలోని నిబంధనల్ని ఉల్లంఘించారని సెక్షన్‌ 51(బి), ప్రజాఆస్తులను ధ్వంసం చేశారని సెక్షన్‌ 3లను పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచారు.

రెండో రోజూ ఉద్రిక్తత..

ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు నాటకీయ పరిణామాల నడుమ కరీంనగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం రాత్రి పోలీసులు సంజయ్‌ను మానకొండూర్‌ ఠాణాకు తరలించగా.. సంజయ్‌ తన అనుచర నేతలతో కలిసి సోమవారం తెల్లవారుజాము వరకు అక్కడే జాగరణ దీక్ష కొనసాగించారు. ఠాణా వెలుపల భాజపా శ్రేణులు పెద్ద ఎత్తున గుమిగూడి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉదయం 6.30 గంటలకు ఆయనను పటిష్ఠ భద్రత నడుమ కరీంనగర్‌లోని పోలీసు శిక్షణ కేంద్రానికి తీసుకెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు న్యాయస్థానానికి తీసుకెళ్లారు. సెక్షన్‌ 333 సంజయ్‌కు వర్తించదని.. రిమాండ్‌ను తిరస్కరించాలన్న ఆయన తరఫు న్యాయవాదులు వాదనలను న్యాయమూర్తి తిరస్కరించారు. జైల్లో సంజయ్‌కు అందించే ఆహారాన్ని తొలుత జైలర్‌ రుచి చూసి అందించాలని న్యాయవాదులు అభ్యర్థించారు.

అరెస్టును ఖండించిన నేతలు..

ఉద్యోగులకు ప్రభుత్వం ద్రోహం చేసిందని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ మండిపడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్‌ రాజ్యాగం అమలవుతోందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. కరీంనగర్‌ కమిషనర్‌ వివాదాస్పద వ్యక్తని.. రామగుండం కమిషనర్‌గా ఉన్నపుడు బండి సంజయ్‌పై దాడికేసులో ఇప్పటికీ విచారణ ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. జీవో 317ను రాజకీయ నేతలకు వర్తింపచేస్తే హరీశ్‌రావు, కేటీఆర్‌లు సొంత నియోజకవర్గాలను వదలాల్సి ఉంటుందని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ దుయ్యబట్టారు. విజయశాంతి, ఉద్యోగ సంఘాల మాజీ నాయకులు సంజయ్‌ అరెస్టును ఖండించారు.

సంజయ్‌ అరెస్టుపై మండిపడ్డ నడ్డా

బండి సంజయ్‌ అరెస్టు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే చర్య అంటూ భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ఇటీవల ఉప ఎన్నికలో భాజపా విజయం, ప్రజాదరణ చూసి తట్టుకోలేక సీఎం కేసీఆర్‌ అసహనంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ జాగరణ దీక్ష చేస్తున్న సంజయ్‌, భాజపా కార్యకర్తల పట్ల తెలంగాణ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. వారిని కస్టడీలోకి తీసుకొనే ముందు కొట్టారని ఆరోపించారు. ఉపాధ్యాయుల డిమాండ్లకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న బండి సంజయ్‌కు కరీంనగర్‌ జిల్లా జైలులో సాధారణ బ్యారక్‌ను కేటాయించారు. చాపతోపాటు దిండు, కార్పెట్లను జైలు అధికారులు అందించారు.

ఇదీచూడండి:

Last Updated : Jan 4, 2022, 6:31 AM IST

ABOUT THE AUTHOR

...view details