కరీంనగర్‌లో పెరగనున్న జనాభాకు అనుగుణంగా రాబోయే 20 ఏళ్లలో చేపట్టబోయే పనులపై ప్రణాళిక రూపొందించారు. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆదేశాలతో డీడీఎఫ్ ఏజెన్సీ ద్వారా అవసరమైన వివరాల్ని సేకరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
పాలకవర్గం ముందుకు ముసాయిదా...
60 డివిజన్లతో ఏర్పాటైన నగరంలో రాబోయే ఆరు నెలల వ్యవధిలోనే బృహత్తర ప్రణాళికను రూపొందించేందుకు శరవేగంగా పనులను ప్రారంభించారు. త్వరలో ప్రజలు, మేధావి వర్గాలతో, వివిధ సంఘాల ప్రతినిధులతో పాటు ఆయా వర్గాల వారితో వేర్వేరుగా సమావేశాల్ని నిర్వహించి వారి అభిప్రాయాల్ని తెలుసుకోనున్నారు. మరోసారి పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించి ప్రణాళిక ముసాయిదాను ప్రకటిస్తారు.
భవిష్యత్ అవసరాలే లక్ష్యంగా...
భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా నివాస, నివాసేతర, వాణిజ్య, పరిశ్రమలు, ఇతర కేటగిరీలుగా ఆయా జోన్‌లను ఏర్పాటు చేయనున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితిని బట్టి దారుల్ని కుదించడం, విస్తరించడం లాంటి చర్యలు చేపట్టనున్నారు. గతంలో నగరంలో చెరువులు, కుంటలు, వ్యవసాయ భూములుగా నమోదై ఉన్న వాటి వాస్తవ స్థితిగతుల్ని పరిశీలించి దానికి అనుగుణంగానే పనులు చేపడతారు.
ఇప్పటివరకు పాత ప్లానే...
ఇప్పటి వరకు కరీంనగర్ కార్పొరేషన్‌లో పాత మాస్టర్ ప్లాన్ అమలవుతోంది. ఎప్పుడో 1983లో రూపొందించిన మాస్టర్ ప్లాన్ యథావిధిగా అమలు చేస్తూ వస్తున్నారు. ఈ కారణంగా వాస్తవాలకు భిన్నంగా ఉన్న తీరుతో రహదారులు, భవన నిర్మాణాలు ఇతరత్రా విషయాల్లో చిక్కులు ఎదురవుతూ వస్తున్నట్లు మేయర్ సునీల్ రావు తెలిపారు..
ప్రధానంగా రహదారుల ఆక్రమణలు, ఇళ్ల అక్రమ నిర్మాణాలు ఇష్టానుసారంగా జరగడంతోపాటు పెరుగుతున్న జనాభా, వాహన రద్దీకి అనుగుణంగా వసతుల కల్పన ఇన్నాళ్లుగా మొక్కుబడిగానే సాగింది. అందుకే పాత పద్ధతిని పూర్తిగా మార్చి క్షేత్రస్థాయిలో వాస్తవాల్ని తెలుసుకునేందుకు డీడీఎఫ్ ఏజెన్సీ కార్యాచరణ అమలు చేయబోతోంది.
సమగ్ర అభివృద్ధికి కొత్త ప్లాన్...
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లతోపాటు తరువాత సుడా పరిధిలోని మరో 71 గ్రామాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సమగ్రమైన ప్రణాళికలను రూపొందించి అమలు చేయబోతున్నారు.ఇప్పటికే స్మార్ట్‌సిటీ పనులతో నగర రూపు రేఖలు మారుతున్నాయి. విశాలమైన రహదారులు, పుట్‌ఫాత్‌లు, పార్కుల నిర్మాణం సాగుతోంది. సమగ్ర అభివృద్దికి ఈ ప్రణాళిక ఎంతో దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు. నగరపాలక సంస్థ ఏ పని చేపట్టినా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొనే పనిచేస్తుందని... ప్రజలు సహకరించాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
ఈ బృహత్తర ప్రణాళికతో అభివృద్ధికి ఇన్నాళ్లుగా ఎదురవుతున్న ఆటంకాలు పూర్తిగా తొలగిపోనున్నాయి. అక్రమ నిర్మాణాలు తొలిగిపోయి బల్దియాకు కూడా ఊహించని తరహాలో ఆదాయం సమకూరే వీలుంది.