తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆంక్షలు ఫలించిన వేళ.. సడలింపులకు సమాయత్తం - తెలంగాణలో కరోనా ప్రభావం

రాష్ట్రంలో మొదట్లో కరోనాతో ఉలిక్కపడ్డ కరీంనగర్​ జిల్లా ప్రస్తుతం కుదుట పడింది. కేసులు తగ్గుముఖం పట్టిన ఫలితంగా పలు ప్రాంతాల్లో ఆంక్షలు ఎత్తివేస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రంలోని రెడ్​ జోన్లలోనూ అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

karimnagar became torchlight for state to control corona
ఆంక్షలు ఫలించిన వేళ.. సడలింపులకు సమాయత్తం

By

Published : Apr 19, 2020, 12:44 PM IST

రాష్ట్రంలోనే తొలిసారిగా అత్యధిక కరోనా కేసులు నమోదు కావడం వల్ల ఉలిక్కిపడ్డ కరీంనగర్‌ జిల్లా ఇప్పుడు కుదుట పడింది. ఇతర ప్రాంతాలకు దిక్సూచిగా మారింది. ఇండోనేషియన్లు పర్యటించిన ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించి వైరస్​ విస్తరించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది జిల్లా యంత్రాంగం. ప్రస్తుతం ఆంక్షలు ఎత్తివేసిన ఏకైక నగరంగా ఖ్యాతి గడిస్తోంది. అధికార యంత్రాంగం అమలు చేసిన విధానాలను రాష్ట్రంలోని ఇతర రెడ్‌‌జోన్లలోను అమలు చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. కొత్త కేసులు నమోదు కాకపోవడం.. సడలింపు ఇవ్వడం పట్ల ప్రజల్లో సంతోషం వ్యక్తం అవుతోంది.

ఆందోళన కాస్త...

కరీంనగర్‌ జిల్లా ప్రజల్లో ఇప్పుడిప్పుడే ఆందోళన స్థానంలో మనోధైర్యం పెరుగుతోంది. కొత్త కేసులు నమోదు కాకపోవడం.. క్వారంటైన్‌లో ఉన్న వారు తిరిగి ఇళ్లకు చేరుకునేందుకు అవకాశం ఇవ్వడంపై సంతోషం వ్యక్తమవుతోంది. రెడ్‌జోన్ ప్రాంతంలోను అమల్లో ఉన్న ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తామంటూ ప్రకటించడం వంటి పరిణామాలు ఊరటనిస్తున్నాయి.

పక్కా వ్యూహం

మార్చి 17న కరీంనగర్‌లో తొలి కరోనా కేసు నమోదైంది. కేవలం వారం వ్యవధిలోనే కేసుల సంఖ్య 14కి పెరిగింది. వైరస్‌ విస్తరించకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో కనీసం మార్గదర్శకాలు విడుదల కాని క్రమంలో అధికార యంత్రాంగం పక్కా ప్రణాళికతో ముందుకు సాగింది. ముకర్రంపుర ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేయడమే కాకుండా.. అన్నిదారులను మూసివేసి కేవలం ఒక్కడి మాత్రమే ఏర్పాటుచేసి పూర్తి స్థాయిలో పహారా ఏర్పాటు చేశారు. నో ఎంట్రీ జోన్‌గా ప్రకటించి.. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఇంటింటా ఆరోగ్య సర్వే, నిత్యవసర వస్తువుల పంపిణీ వంటి చర్యలు చేపట్టారు. ఫలితంగా చాలా మందికి పరీక్షల్లో నెగెటివ్‌ రావడం వల్ల ఐసోలేషన్‌లో ఉన్నవారిని కూడా ఇళ్లకు పంపించారు.

ఓవైపు రెడ్‌జోన్‌ ప్రాంతంలో వైద్యపరీక్షలు నిర్వహిస్తూ.. నిరంతరం వైరస్‌ వ్యాప్తి చెందకుండా సర్వేలు చేస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే యత్నం చేశారు. జ్వరం, జలుబు ఇతర లక్షణాలున్న వారిని గుర్తించారు.

సమగ్ర దర్యాప్తు ఫలితం

మార్చి 14న ఇండోనేషియన్లు కరీంనగర్‌కు వచ్చిన నుంచి.. ఎక్కడెక్కడ తిరిగారు.. ఎవరిని కలిశారనే కోణంలో అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. అనుమానమున్న 82 మందిని ఐసోలేషన్‌ వార్డులకు తరలించారు. పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాన్ని కంటైన్​మెంట్​ జోన్​గా ప్రకటించారు. ప్రజలు బయటకు రాకుండా.. సీసీ కెమెరాలు, డ్రోన్‌ కెమెరాల సాయంతో పర్యవేక్షించారు. పరిస్థితి అదుపులోకి వచ్చాక.. ఆంక్షలను క్రమంగా ఉపసంహరించేందుకు చర్యలు చేపట్టారు.

ఒకవైపు ఆంక్షలు కొనసాగుతున్న వేళ... ప్రజాప్రతినిధులు కూడా ప్రజల్లో మనోధైర్యాన్ని నెలకొల్పేందుకు విస్తృతంగా పర్యటించారు. ఆంక్షలు ఎందుకు అమలు చేయాల్సి వచ్చిందో వివరించారు.

కొత్త కేసులు నమోదు కానంత మాత్రాన ఊపిరి పీల్చుకోవాల్సిన పరిస్థితి లేదని మరో నలుగురి నివేదికలు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు. సాహెత్‌ నగర్‌లో ఒక వ్యక్తికి 29 రోజులకు పాజిటివ్‌ రావడం వల్ల మరింత జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ నిబంధనలను పాటించాలని ప్రజలను కోరుతున్నారు.

ఇవీచూడండి:కరీంనగర్ కమిషనరేట్ పరిధి​లో డ్రోన్​ల నిఘా

ABOUT THE AUTHOR

...view details