Inspection at Karimanagar Hotels : కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని హోటళ్లలో... హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక స్క్వాడ్ బృందాలు ఆహార తనిఖీల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాయి. మహబూబ్‌నగర్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. ఇద్దరు చొప్పున ఇన్‌స్పెక్టర్లు మరో ఐదుగురు అధికారులు మొత్తం 10 మంది వరకు వేర్వేరు చోట్ల తనిఖీలను నిర్వహించారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని పేరొందిన నాలుగు హోటళ్లలో ఆందోళనకర పరిస్థితులు బయటపడ్డాయి.
చికెన్‌తోపాటు రోజువారీగా వినియోగించే చాలా ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన తీరుని గుర్తించి వాటిని పారవేయించారు. ఇలాంటి ఆహార పదార్ధాలను విక్రయించడం, నిల్వచేయడం సరికాదని హెచ్చరించారు. రుచికోసం వాడుతున్న వాటి నమూనాలను తీసుకున్నారు. నూనెలతో పాటు ప్రతి నిత్యావసర సరకుల నాణ్యతను గమనిస్తూనే వాటి గడువు తేదీని పరిశీలించారు. అంతేకాకుండా ఆరు కిరాణ దుకాణాల్లోకి వెళ్లి అమ్ముతున్న వాటి అసలు తీరుని పరిశీలించారు. నిర్ణీత తేదీ దాటిన వాటిని గుర్తించి వాటిని తొలగించేలా చేశారు.
Hotels Inspection in Karimanagar : ముఖ్యమైన హోటళ్లతోపాటు ఆహార భద్రత పరిధిలోకి వచ్చే పలు దుకాణాల్లో ముమ్మరంగా అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 16 నమూనాలను సేకరించి ల్యాబ్‌కు తీసుకెళ్లారు. దాదాపుగా వీటన్నింటి వల్ల ముప్పు ఉందనేలా అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ల్యాబ్‌కు పంపించిన తర్వాత మరో 15 రోజుల్లో వీటి ఫలితం తేలుతుందని అధికారులు తెలిపారు. స్థానికంగా ఉన్న అధికారులను కాదని ప్రత్యేకంగా వచ్చిన బృందాలు ఇక్కడి శుచి, శుభ్రత్ర, నాణ్యత, భద్రతలపై దృష్టి సారించడం స్థానికంగా కలకలాన్ని సృష్టించింది.