ఉత్తర తెలంగాణలోనే కీలకమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏళ్లతరబడి రహదారుల విస్తరణ ప్రక్రియనే పెనుసమస్యగా మారింది. 2014లో జాతీయ రహదారులుగా ఏర్పాటైన పలుమార్గాలకు మోక్షం లభించేలా పూర్తిస్థాయి నిధులు ఇన్నాళ్లుగా అందలేదు. ముఖ్యంగా వరంగల్-కరీంనగర్-జగిత్యాల మార్గానికి ఈ ఏడాది ఎంతలేదన్నా రూ.500కోట్ల నిధులు కేటాయించాల్సిన అవసరం అత్యధికంగా ఉంది. ఇదే సమయంలో కరీంనగర్- సిరిసిల్ల- పిట్లం, సిరిసిల్ల- సిద్దిపేట-జనగాం, జగిత్యాల- మెట్‌పల్లి- నిజామాబాద్, నిర్మల్- ఖానాపూర్- జగిత్యాల, కరీంనగర్- మానకొండూర్- వీణవంక-భూపాలపల్లి, రాయపట్నం- కరీంనగర్- కోదాడ మార్గాల ప్రకటన తప్పా.. వాటి అడుగులు ముందుకుపడేలా నిధుల మాటే ఇన్నాళ్లుగా వినిపిస్తలేదు. ఈ బడ్జెట్‌లోనైనా వీటి ప్రస్తావన ఉంటే ప్రయాణ సౌలభ్యం నాలుగు జిల్లాలతోపాటు సరిహద్దు జిల్లాలకు మరింతగా పెరగనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమారుగా 2వేల కి.మీ దారులు మెరుగుపడేలా ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన నిధుల పరంగా కరుణ ఉండాలి.
పరి‘శ్రమ’ పెరిగేలా..
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి దిశగా అడుగులు పడటంతోపాటు ఈసారి అక్కడి అభివృద్ధి పనులకు తగిన నిధులు నేటి బడ్జెట్‌లో కేటాయించే వీలుంది. ఇదే కాకుండా ఆహారోత్పత్తులు, ఇతర పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా ప్రకటనలలు, రాయితీ, రుణ వర్గాలుండాలనే ఆశను ఔత్సాహికులతోపాటు ఉపాధి కోసం ఉబలాటపడుతున్న యువత చూపుతున్నారు. ఇక అంకుర పరిశ్రమలతోపాటు మేకిన్ ఇండియా బలోపేతం చేసే దిశగా జిల్లాను తాకేలా కేటాయింపు జోరు కనిపించాలి. నైపుణ్యాభివృద్ధి పెరిగేలా తోడ్పాటు పలురకాలుగా పెరగాలి. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కార్మికులకు మేలు చేసేలా.. వారి శ్రమశక్తి పెరిగేలా ప్రకటనుండాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్దఎత్తున ఉన్న కార్మిక వర్గానికి న్యాయం చేసేలా నిర్ణయాలు వెలువడాలి. 4లక్షలమంది ఉపాధి కూలీలు జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వరంగా మార్చుకుని దినసరి వేతనాన్ని అందుకుంటున్నారు. ఈ ఏడాది వ్యవసాయానుబంధంగా పనుల కల్పనతోపాటు వీలైనన్ని ఎక్కువ పనులు అందించేలా నిధులు విడుదల చేసేలా బడ్జెట్‌లో పెద్దపీట కనిపించాలి. వ్యవసాయాధారిత జిల్లాగా.. పేరొందిన నాలుగు జిల్లాలోని 6 లక్షల మంది రైతులకు సంబంధించి కేంద్రం పథకాల పంథాను మరింత ఉపయుక్తంగా మార్చాలి. పసల్‌బీమా వర్తింపజేసేలా భారీగా నిధులు కేటాయించడంతోపాటు పండించిన పంటలకు మేలు చేసేలా నిర్ణయాలు కనబడాలి.