Floods Effect: భారీ వర్షాలకు చిగురుటాకుల్లా వణికిన బడుగుజీవులు తమ నివాసాలు నేలకూలడంతో.. నిలువ నీడ కరవై నానాపాట్లు పడుతున్నారు. పునరావాస కేంద్రాల నుంచి తిరిగి వచ్చిన వారు.. విరిగిపోయిన గోడలు, కూలిన పైకప్పులు చూసి బావురుమంటున్నారు. వెంటనే మరమ్మతులు చేసుకునే స్తోమత లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పిల్లాపాపలతో.. పరాయిపంచనో, సగం కూలిన ఇంట్లోనో తలదాచుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. నష్టపరిహారానికి సంబంధించి రెవెన్యూ అధికారుల సర్వేలు పూర్తయినా, ఇంకా ఎవరికీ సొమ్ము అందలేదు. త్వరలోనే పరిహారం సొమ్ము అందిస్తామని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం తెలిపారు.
ఏ జిల్లాలో ఎన్ని..
పెద్దపల్లి జిల్లాలో 1975 ఇళ్లు దెబ్బతినగా, మంథని నియోజకవర్గంలో 1,838 ఇళ్లు నీటమునిగి గోడలు ధ్వంసమయ్యాయి. జగిత్యాలలో 267, కరీంనగర్ 120, సిరిసిల్లలో 121 ఇళ్లు కూలిపోయాయి.
* ఆదిలాబాద్ జిల్లాలో 67 గృహాలు పూర్తిగా నేలకూలాయి. మంచిర్యాలలో 45, కుమురం భీం జిల్లాలో 95, నిర్మల్‌లో 150 ఇళ్లు ధ్వంసమయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 12 ఇళ్లు పూర్తిస్థాయిలో, 304 ఇళ్ల గోడలు దెబ్బతిన్నాయి. నిజామాబాద్‌లో 417 పాక్షికంగా, మరో 11 ఇళ్లు పూర్తిస్థాయిలో పనికిరాకుండా పోయాయి.