Godavari flood victims wait for Govt Help: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గోదావరి జలప్రళయం తీరని నష్టాన్నిమిగిల్చింది. ఊహించని విధంగా తమ ఇళ్లు, దుకాణాల్లోకి చొచ్చుకు వచ్చిన నీరు తమను నిలువ నీడలేకుండా చేసిందనే ఆవేదన ధర్మపురి, మంథని వాసుల్లో వ్యక్తమయ్యింది. కడెం ప్రాజెక్టు ఉపద్రవం ఇలా ఉంటుందని తాము ఏనాడు ఊహించుకోలేదని.. అధికారులు కూడా అంచనా వేయకపోవడంతో తాము కట్టుబట్టలతో బజార్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గోదావరి వరద ఉద్ధృతి తగ్గి రెండు నెలలు గడిచినా... ఆ గాయాలు మాత్రం మానలేదు. ధర్మపురిలో తెనుగువాడ, గంపలవాడ, గోలివాడ, బ్రాహ్మణవాడ, బోయవాడ నీటమునిగాయి. నిత్యావసర సరుకులు, గృహోపకరణ వస్తువులు కొట్టుకుపోయాయి. వేలాది రూపాయల విలువ చేసే ఎలక్ట్రానిక్ వస్తువులు నీట మునిగి... పనికి రాకుండా పోయాయి. గోదావరి ఒడ్డున మంగలిఘాట్ వద్ద చిరు వ్యాపారుల వస్తువులు కొట్టుకపోవడంతో... లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. రెండు నెలలు గడిచిన సర్కార్ నుంచి ఏమాత్రం సాయం లభించలేదని బాధితులు వాపోతున్నారు.