గోదావరి ప్రాజెక్టులకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఎస్ఆర్ఎస్పీ (SRSP)కి 95 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దివన ఉన్న ఎల్లంపల్లిలో పూర్తి స్థాయి నీటిమట్టానికి దగ్గరగా నిల్వ ఉండగా.. ప్రవాహం 15 వేల క్యూసెక్కులకుపైనే ఉంది. దీంతో ఎల్లంపల్లి నుంచి సుందిళ్లకు నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. గత నెల రెండో వారం నుంచి మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోసి.. మధ్యమానేరుకు మళ్లించారు. ప్రస్తుతం మధ్యమానేరు, దిగువ మానేరులో కలిపి 44 టీఎంసీలు నిల్వ ఉండగా.. ఈ రెండింటిలో పూర్తి స్థాయి నిల్వకు మరో ఏడు టీఎంసీలు మాత్రమే అవసరం. సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టుల్లోకి వరుసగా 2790, 923 క్యూసెక్కుల ప్రవాహం ఉంది.
శ్రీరాంసాగర్‌లోకి సోమవారం ఉదయం ఆరు గంటలకు 20,695 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, సాయంత్రం ఆరుగంటలకు 95,761 క్యూసెక్కుల ప్రవాహం.. 40 టీఎంసీల నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టు నిండటానికి మరో 50 టీఎంసీలు అవసరం. దిగువన ఉన్న కడెం ప్రాజెక్టు గేట్లు ఎప్పుడైనా ఎత్తే అవకాశం ఉంది. ఎల్లంపల్లి పరిస్థితి కూడా ఇంతే. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా, 147.11 మీటర్ల వద్ద నీటిమట్టం ఉంది. 15,444 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. దిగువన మధ్యమానేరులో నిల్వ పూర్తి స్థాయికి దగ్గరగా ఉండటంతో నంది పంపుహౌస్ నుంచి నీటిని ఎత్తిపోయడం లేదు.
ఎల్లంపల్లికి ప్రవాహం పెరిగితే
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లల నుంచి నీటి ఎత్తిపోత నిలిపివేశారు. మానేరు ప్రాంతంలో కురిసే వర్షాలతో అన్నారం బ్యారేజీకి సుమారు రెండువేల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. ఎల్లంపల్లికి ప్రవాహం పెరిగితే అనివార్యంగా సుందిళ్ల, అన్నారం ద్వారా మేడిగడ్డకు నీటిని వదలాల్సి వస్తుంది. ప్రస్తుతం మేడిగడ్డ వద్దకు వచ్చే సుమారు 50 వేల క్యూసెక్కులకుపైగా నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద క్రమంగా నీటి ప్రవాహం పెరుగుతోంది.