Muthyampet Sugar Factory: నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని నిజాం చక్కెర పరిశ్రమకు అనుబంధంగా 1982లో జగిత్యాల జిల్లా ముత్యంపేటలో చక్కెర పరిశ్రమ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తర్వాత... ముత్యంపేట చక్కెర పరిశ్రమ మూతబడింది. ఫలితంగా స్థానిక చెరకు రైతులకు పంట అమ్మేందుకు అనేక ఇబ్బందులు తలెత్తగా... స్థానికంగా 40 వేలమందికిపైగా ఉపాధి కోల్పోయారు. అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో ముత్యంపేట చక్కెర పరిశ్రమను తెరిపిస్తామన్న సీఎం కేసీఆర్... ఎనిమిదేళ్లైనా దాని ఊసేలేదు. ఏడేళ్లుగా అక్కడి చెరకు రైతులు పోరాటాలు చేస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోవట్లేదు.
రాష్ట్ర ఆవిర్భావం అనంతరం మాజీ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ నేతృత్వంలో ప్రభుత్వం ప్రత్యేక కమిటీని వేసింది. 2015 జూలైలోపు విధివిధానాలను ఖరారు చేస్తూ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆ కమిటీ సకాలంలో నివేదికను ఇవ్వడంలో విఫలమయింది. ఆనాడు నిజాం ఉపాధి కోసం చక్కెర పరిశ్రమలను నిర్మిస్తే నేటి పాలకులు రైతులు ఇబ్బంది పడుతున్న వాటిని మూసివేయించడం ఎంత వరకు న్యాయం అన్న విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రత్యామ్నాయ పంట వేయాలని చెబుతున్న సర్కార్... చెరకు వేసినా ప్రోత్సాహించట్లేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, సారంగాపూర్, బీర్‌పూర్ మండలాల రైతులు చెరకు ప్రధాన పంటగా సాగు చేస్తున్నారు. ముత్యంపేట పరిశ్రమ మూతపడడంతో అదనపు రవాణా ఖర్చులు చెల్లించి... కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌కు తరలించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ముత్యంపేటలోని చెరకు కార్మాగారాన్ని తెరిపించాలని కోరుతున్నారు.