కరీంనగర్ నగరపాలక సంస్థ ఇంటింటి నుంచి సేకరిస్తున్న చెత్త డంపింగ్ యార్డుల్లో కొండలా పేరుకుపోతోంది. కొత్త డంపింగ్ యార్డు కోసం స్థలం దొరికే పరిస్థితి లేకపోవడంతో నగరపాలక అధికారులు బృహత్తర ప్రణాళిక అమలు చేస్తున్నారు. నగరంలో నిత్యం వెలువడుతున్న 160మెట్రిక్ టన్నుల చెత్తను మానేరు నది తీరాన గల ఆటోనగర్‌కు చేరవేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ కొంత భాగాన్ని చెత్తను పొడి, తడి చెత్తగా వేరు చేసి కంపోస్టు ఎరువు తయారు చేసే ప్రక్రియ విజయవంతంగా సాగుతోంది. 3 చోట్ల కంపోస్టు ఎరువు తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయగా... మంచి ఫలితాలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.
కరీంనగర్లో సత్ఫలితాలిస్తున్న చెత్త మంత్రం...
ఇళ్ల నుంచి వెలువడే చెత్తను ఎరువుగా మార్చేందుకు కరీంనగర్ నగరపాలక సంస్థ పకడ్బందీ ప్రణాళికలు అమలు చేస్తోంది. టన్నుల కొద్ది వెలువడే చెత్తను సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలన్న ప్రయత్నం విజయవంతంగా సాగుతోంది. గృహిణులు కూడా కంపోస్టు ఎరువును తయారు చేసి మెుక్కలకు వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
నగరపాలక సంస్థ ఇచ్చిన సూచనలను మహిళలు స్వాగతిస్తున్నారు. కరోనా కారణంగా మిద్దెతోటలకు అలవాటు పడిన మహిళలు ఇళ్లలోనే కంపోస్టు ఎరువుల తయారీకి ప్రాధాన్యతనిస్తున్నారు. కంపోస్టు ఎరువు వినియోగిస్తే కూరగాయలు, పండ్లు రుచిగా ఉంటున్నాయని చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు కంపోస్టు ఎరువులతోనే కూరగాయలు పండిస్తున్నట్లు తెలిపారు. కంపోస్టు ఎరువులు తయారు చేయడమే కాకుండా తయారీ పద్ధతుల పట్ల అవగాహన కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటి వరకు తడిపొడి చెత్తను మాత్రమే వేరు చేయాలని సూచిస్తున్న అధికారులు తాజాగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలను, సానిటరీ వ్యర్థాలను వేరు చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు.