TELANGANA BJP: ఫలించిన వ్యూహాలు.. కమలదళంలో కొత్త జోష్ హుజూరాబాద్ ఉపఎన్నికలో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ సాధించిన విజయం పార్టీ నాయకులు, క్యాడర్‌లో సరికొత్త ఉత్సాహం నింపింది. ఈటల రాజేందర్ వ్యక్తిగత ప్రతిష్ఠ, ఓటర్ల సానుభూతితో పాటు.. పార్టీ నాయకులు, కార్యకర్తలు హుజూరాబాద్‌లో మకాం వేయడం, ముఖ్య నేతలు విస్తృతంగా ప్రచారం చేయడం వంటి అంశాలూ పార్టీకి కలిసివచ్చాయి.
పక్కా ప్రణాళికతో..
ఈటలను పార్టీలో చేర్చుకోవడం దగ్గరి నుంచి ఎన్నికల ప్రచారం వరకు భాజపా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆయన జూన్ 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. 14న కాషాయకండువా కప్పుకొన్నారు. ఆ తర్వాత నియోజకవర్గానికి వెళ్లి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మోకాలి శస్త్రచికిత్సతో కొద్దిరోజులు విరామం తీసుకున్నారు. జూన్ మూడో వారం నుంచి దాదాపు నాలుగు నెలలకుగాపైగా ప్రజల్లోనే ఉన్నారు. మరోవైపు నియోజకవర్గానికి, మండలాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించిన భాజపా.. పోలింగ్ బూత్‌లు, శక్తికేంద్రాల వారీగా పార్టీ శ్రేణుల్ని మోహరించింది. దాదాపు 1,200 మంది కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు. ఈటల పార్టీలో చేరిన కొద్ది రోజులకే పాత, కొత్త క్యాడర్‌తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన బండి సంజయ్ వారి మధ్య సమన్వయం చేశారు.
అదే భాజపాకు కలిసివచ్చింది..
తెరాస, కాంగ్రెస్ అభ్యర్థులతో పోలిస్తే ఈటల బలమైన నేత కావడం భాజపాకు కలిసివచ్చింది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. తన వెంట ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల్ని తెరాస ఆకర్షించినా ఈటల ధైర్యం కోల్పోలేదు. 'కేసీఆర్ అహంకారానికి, హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య పోరాటం.. ‘నేను మీ బిడ్డను.. చంపుకుంటారో, సాదుకుంటారో.. మీ ఇష్టం' అంటూ ఓటర్లపై భావోద్వేగ అస్త్రాన్ని సంధించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ, ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్ పెద్ద ఎత్తున ఈటల తరఫున ప్రచారం చేశారు. తెరాస హామీలు, వైఫల్యాలను భాజపా నాయకులు క్షేత్ర స్థాయిలో ఎండగట్టారు. వరి వేస్తే ఉరే అన్న వ్యాఖ్యలు, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి వంటి అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో భాజపా సఫలీకృతమైంది.
ఈటల సతీమణి జమున మహిళల మద్దతు కూడగట్టేందుకు ఊరూరా తిరిగారు. ఇవన్నీ ఆయన విజయానికి బాటలు వేశాయి. ఈ గెలుపు నియోజకవర్గ ప్రజలకే అంకితమని, వారికి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేమని ఈటల రాజేందర్ స్పష్టంచేశారు.
భాజపాకు ముగ్గురు ఎమ్మెల్యేలు..
శాసనసభ సాధారణ ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానం గెలిచిన కమలదళానికి ఉప ఎన్నికలు కలిసివచ్చాయి. గతేడాది దుబ్బాకలో, ఇప్పుడు హుజూరాబాద్‌లో విజయంతో అసెంబ్లీలో భాజపా ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు పెరగనుంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ స్థానంలో రాజాసింగ్ ఒక్కరే విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా నలుగురు ఎంపీలు విజయం సాధించారు. నాటి నుంచి రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. కాంగ్రెస్, తెరాస, తెదేపాల నుంచి పలువురు నేతల్ని చేర్చుకుంది. దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్‌రావు విజయం సాధించగా.. ఆ తర్వాత జీహచ్ఎంసీ ఎన్నికల్లో పెద్దసంఖ్యలో సీట్లను భాజపా గెలుచుకుంది. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్ పట్టభద్రుల సిట్టింగ్ సీటును కోల్పోగా.. నల్గొండలో నాలుగో స్థానానికి పరిమితమైంది. నాగార్జునసాగర్ ఉపపోరు, పురపాలక ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశ మిగిల్చాయి. ఈ తరుణంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక రూపంలో వచ్చిన అవకాశాన్ని కమలదళం అందిపుచ్చుకుంది. ఈటల రాజేందర్ విజయంతో వచ్చిన ఉత్సాహంతో 2023 ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్రంలో మరింత బలపడాలని భావిస్తోంది.
ఇదీచూడండి:Huzurabad Bypoll Results: భాజపా-తెరాస హోరాహోరీ పోరులో.. వికసించిన కమలం