భాజపా నేత ఈటల రాజేందర్ మరోసారి తెరాసపై విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో మాటాల తూటాలు పేల్చారు. హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో కరీంగరన్ జిల్లా సిర్శపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి హరీశ్‌రావు, తెరాసపై ఎన్నికల ప్రచారంలో భాగంగా మండిపడ్డారు.
హుజూరాబాద్‌లో ఒక్క డబుల్ బెడ్ రూం కట్టలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్క రోడ్డు కూడా వెయ్యలేదని హరీశ్‌రావు అనడం సరికాదన్నారు. దళితబంధు పథకం అందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తే.. తనపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగ సంతకాలు పెట్టి, తప్పుడు పత్రాలు సృష్టించి.. దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇతర కులాలు, మతాల్లో ఉన్న పేదవారికి 10 లక్షల సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. తెరాస కుట్రలను ప్రజలే భగ్నం చేస్తారని అభిప్రాయపడ్డారు. అధికార పార్టీ హుజూరాబాద్‌లో గెలుపొందడం కోసం... ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయాలను ఖర్చు చేసిందని ఆరోపించారు.