తెలంగాణ

telangana

ETV Bharat / city

భగీరథ జలమే ఆరోగ్యానికి బాసట.. తాగునీటి వినియోగంపై ప్రచారం - కరీంనగర్​ జిల్లాలో భగీరథ జలాలు తాజా వార్త

మిషన్‌ భగీరథ పథకం కింద కరీంనగర్​ జిల్లాలో స్వచ్ఛమైన గోదావరి నీటిని ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో పైప్‌లైన్లు, ట్యాంకులకు అనుసంధాన ప్రక్రియ చేయకపోవడం వల్ల పల్లె ప్రజలు భగీరథ నీటిని తాగేందుకు ఇష్టపడటం లేదని ప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. అయితే రివర్స్‌ ఆస్మాసిస్‌ వాటర్‌(ఆర్వో) ప్లాంట్ల నిర్వాహకులు శుద్ధ జలం పేరిట క్యాన్‌ను రూ.15 నుంచి రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. నాణ్యత లేని నీటిని విక్రయించడమే కాకుండా మిషన్‌ భగీరథ నీటిని ఉపయోగించవద్దని దుష్ప్రచారం చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. వీరి ఆగడాలను అరికట్టడంతో పాటు ఆర్వో ప్లాంట్ల నియంత్రణకు ప్రభుత్వం ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.

awareness program on bhageeratha water in karimnagar district
భగీరథ జలమే ఆరోగ్యానికి బాసట.. తాగునీటి వినియోగంపై ప్రచారం

By

Published : Nov 11, 2020, 2:47 PM IST

ఇటీవల ఎన్టీపీసీ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మిషన్‌ భగీరథ పథకం అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అసంపూర్ణ నిర్మాణాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని పేర్కొన్నారు. గ్రామాల్లో భగీరథ నీటి ప్రయోజనాలను క్రమం తప్పకుండా ప్రచారం చేయాలని సూచించారు. జిల్లాలో 200కు పైగా నీటి శుద్ధి(ఆర్వో) ప్లాంటు కేంద్రాలున్నాయి. అయితే ఈ నీరు ప్రమాదకరమైనదని, కీళ్లు, మూత్రపిండ సంబంధిత వ్యాధులు ప్రబలేందుకు కారణమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి మిషన్‌ భగీరథ పథకం ద్వారా శుద్ధ జలం ఉచితంగా అందిస్తున్న నేపథ్యంలో గ్రామీణ నీటి సరఫరా, భగీరథ విభాగాధికారులు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

అపరిశుభ్రంగా ఆర్వో కేంద్రాలు

పెద్దపల్లి జిల్లాలో రామగుండం నగరపాలక సంస్థ, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ పురపాలికల పరిధిలో ఏర్పాటు చేసిన వందలాది ఆర్వో ప్లాంట్లలో అపరిశుభ్రత తాండవిస్తోంది. 20 లీటర్ల క్యాన్‌లో చెత్త చెదారం, పురుగులు, పాకురుతో కూడిన నీటిని విక్రయిస్తున్నట్లు గతంలో ఫిర్యాదులు వచ్చాయి. భూగర్భ జలాన్ని శుద్ధి చేసి విక్రయిస్తుండగా, ఇందుకు వినియోగించే క్యాన్ల శుభ్రతను పట్టించుకోవడం లేదు. ఆర్వో ప్లాంట్ల ఏర్పాట్లు, కట్టడిపై నియంత్రణ లేకపోవడం వల్ల నిర్వాహకుల ఆగడాలు కొనసాగుతున్నాయి. నాణ్యత లేని నీటిని సరఫరా చేయడమే కాకుండా అనుమతులు లేకుండా ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. ఆర్వో ప్లాంట్ల నీరు సురక్షితం కాదని గ్రామీణ నీటి విభాగం అధికారులు చెబుతున్నప్పటికీ వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వ శాఖలు స్పందించడం లేదు.

ఇంటింటికీ భగీరథ నీటి సరఫరా

జిల్లావ్యాప్తంగా 436 ఆవాసాల్లో ప్రస్తుతం మిషన్‌ భగీరథ ద్వారా శుద్ధమైన నీటిని అందిస్తున్నారు. నీటి సరఫరా ప్రారంభ సమయంలో పరిసరాలు కొంత అపరిశుభ్రంగా మారాయి. పైపుల్లో పేరుకుపోయిన చెత్తచెదారం, మట్టి వల్ల తాగునీరు కూడా మురికివాసన, చెత్తచెదారంతో, పసుపుపచ్చగా సరఫరా అయింది. దీనికి తోడు అధికారులు కూడా లీకేజీలను గుర్తించాలనే ఉద్దేశంతో ప్రయోగాత్మకంగా సరఫరా చేశారు. అయితే శుద్ధ జలం ప్రజలకు ఉచితంగా అందితే తమ ప్లాంట్లను మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని గమనించిన ఆర్వో ప్లాంట్ల యజమానులు గ్రామాల్లో దుష్ప్రచారం చేశారు. ఇది ప్రజల్లోకి తీవ్రంగా వెళ్లి భగీరథ నీటిని తాగడానికి అనాసక్తి కనబరుస్తున్నారని ఇంటెలిజెన్స్‌ నివేదికలు తేల్చాయి. మరోవైపు ఆయా గ్రామాల్లో ప్రత్యేక బృందాలతో భగీరథ నీటి ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తుండటంతో ఇప్పుడిప్పుడే ఆర్వో నీటి వినియోగం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.

భగీరథ నీళ్లే సురక్షితం

లీటరు భగీరథ నీటిలో కాల్షియం, క్లోరైడ్‌, ఐరన్‌, మెగ్నీషియం, నైట్రేట్‌, కాల్షియం కార్బొనేట్‌, లవణాలు 100-120 మిల్లీ గ్రాములు ఉంటాయి. అదే ఆర్వో ప్లాంటు నీటిలో లవణాలు 25 మిల్లీ గ్రాములు ఉండటంతోనే చర్మ, కాలేయ, ఉదర, మూత్రపిండాల వ్యాధులు ప్రబలుతున్నాయి. అందువల్ల భగీరథ నీళ్లే సురక్షితమని... భగీరథ నీటి ఉపయోగాలపై సిబ్బందితో కలిసి ప్రచారం చేస్తున్నామని మిషన్​ భగీరథ ఈఈ సతీశ్​ తెలిపారు. అసంపూర్తిగా పనులు పూర్తి చేసేందుకు రూ.15 కోట్లతో ప్రతిపాదించాం. ప్రభుత్వం మంజూరు చేయనున్న రెండు పడక గదుల ఇళ్లను కూడా భగీరథ నీటికి అనుసంధానించే ప్రక్రియకు శ్రీకారం చుట్టాం.

మండలం ప్రతిపాదించిన నిధులు(రూ.లక్షల్లో)

పెద్దపల్లి 27

కాల్వశ్రీరాంపూర్‌ 32

ఓదెల 16

అంతర్గాం 3.35

పాలకుర్తి 8.71

కమాన్‌పూర్‌ 723.30

మంథని 183.60

ముత్తారం 224.18

రామగిరి 495.00

ఇదీ చూడండి:'మినరల్ వాటర్​ కన్న... మిషన్ భగీరథ నీళ్లు మిన్న'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details