24 hours water supply: ఆకర్షణీయ నగరాల జాబితాలో చేరిన కరీంనగర్ ప్రజలకు.. తాగునీరు, పారిశుధ్య సేవలు అందించడంలో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. మిషన్ భగీరథ నీటి సరఫరా ప్రారంభమైనప్పటి నుంచి తాగు నీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా పోయింది. అంతకు ముందు నగరంలోకి కొన్ని జోన్లలో ఒకరోజు.. మరికొన్ని జోన్లలో మరో రోజు తాగునీటి సరఫరా చేసే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం పెరుగుతున్న జనాభాతో పాటు... ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు తాగునీరు సరఫరా చేసే విధంగా ప్రణాళిక అమలు చేయబోతున్నారు.
తొలుత 3 జోన్లకు..
నగరంలో మొత్తం 16 జోన్లు ఉండగా.. భగత్‌నగర్, రాంపూర్, హౌజింగ్ బోర్డు కాలనీలలో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు... 18 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నారు. మొత్తం నగరానికి నిరంతర నీటి సరఫరా పనులు చేపట్టాలంటే 70 కోట్ల రూపాయలకుపైగా అవుతాయని అంచనా వేసిన అధికారులు.. తొలుత 3 జోన్లకు పరిమితం చేశారు. ఆయా ప్రాంతాల్లో నీరు అందించాలంటే ముందుగా లీకేజీలను సరిచేయడం.. అవసరమున్న చోట్ల పైప్‌లైన్లను మార్చడం, ఇంటర్ కనెక్షన్లు పూర్తి చేయడం, కొత్త పైప్‌లైన్లకు ఇంటింటా కనెక్షన్లు ఇవ్వడం లాంటి పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆయా జోన్లలో... పనులను సిబ్బంది పూర్తి చేయిస్తున్నారు. ప్రస్తుతం ప్రతిరోజు నీరు సరఫరా చేస్తున్నప్పటికి.. నిరంతర నీటి సరఫరా వల్ల డిమాండ్ తగ్గడం నీరు కలుషితం కాకుండా అడ్డుకట్ట వేసేందుకు అవకాశం ఉంటుందని మేయర్ సునీల్ రావు తెలిపారు.