జునోసిస్... ఒక జంతువు నుంచి మనిషికి వ్యాపించే వ్యాధి. ఓ అంటువ్యాధి. ఎబోలా వైరస్ వ్యాధి, సాల్మొనెలోసిన్ వంటి ప్రధాన ఆధునిక వ్యాధులే జునోసిస్. హెచ్ఐవీ అనేది కూడా 20వ శతాబ్ధం ప్రారంభంలో మానవులకు సంక్రమించే ఒక వ్యాధి అయినప్పటికీ ఇది ప్రత్యేకంగా మానవుల ద్వారా సంక్రమించే వ్యాధిగా మార్చబడింది. మానవులకు సంక్రమించే ఇన్ఫ్లూఎంజా... పక్షి ఫ్లూ, స్వైన్ఫ్లూ వంటివన్నీ జునోసిస్ కిందకు వస్తాయి. ఈ వైరస్లు అప్పుడప్పుడు మానవ జాతుల్లో తిరిగి కలుస్తాయి. 1918లో స్ఫానిష్ ఫ్లూ, 2009లో స్వైన్ ఫ్లూ, కొవిడ్-19 వైరస్లు వంటివి మహమ్మారి వ్యాధులకు కారణమయ్యాయి. ఉద్భవిస్తున్న వైరస్లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, పరాన్న జీవులు వంటి వ్యాధికారక క్రిముల వల్ల జునోసిస్ సంభవిస్తుంది.
ఏది ఏమైనప్పటికీ రేబిస్ కుక్కల నుంచి మానవులకు సోకే ప్రాణాంతక వ్యాధి. ఒక్క ప్లేగు వ్యాధి వల్ల 1898 నుంచి సుమారు 120 లక్షల మంది ప్రజలు చనిపోయారు. ఇక రేబిస్ వ్యాధి చేసే నష్టం అంతా ఇంతా కాదు. 20 వేల మంది ప్రజలు, లక్ష వరకు పశువులు రేబిస్ వ్యాధి బారినపడి చనిపోయినట్లు నమోదైంది. 17 లక్షల మంది ప్రజానీకం రేబిస్ వ్యాధి నిరోధక టీకాలను కుక్క కాట్ల వల్ల చేయించుకున్నారు. బ్రూసెల్ల వ్యాధి వల్ల సుమారు 340 కోట్ల రూపాయల నష్టం నమోదైంది. గతంలో ప్రపంచాన్ని ఇబ్బందిపెట్టిన ఎయిడ్స్ వ్యాధి కూడా ఒకప్పుడు జంతువుల నుంచి మనుషులకు సొకిన జునోటిక్ వ్యాధిగానే చెప్పవచ్చు. కానీ, ప్రస్తుతం అది పూర్తి పరివర్తన చెంది మానవ జీవితాల్లోనే మనుగడ సాగిస్తోంది.
ఈ వ్యాధులు... అంతర్జాతీయ సమస్యే..
ఈ జునోటిక్ వ్యాధులు బాక్టీరియా, వైరస్, ఫంగస్, పరాన్న జీవులు జంతువుల నుంచి మనుషుల్లో రకరకాల మార్గాల్లో చేరి ఆయా వ్యాధులు కలిగిస్తాయి. సమజాత శారీరక, జీవన లక్షణాలు కలిగి ఉన్న జంతువులు, మానవుల మధ్యలో ఈ వ్యాధుల వ్యాప్తి సహజం. సామీప్య సహచర జీవనం ద్వారా జంతు ఉత్పత్తులైన పాలు, గుడ్లు, మాంసం వల్ల మనుషులకు జునోటిక్ వ్యాధులు సోకే అవకాశం ఉంది. అంతే కాకుండా గాలి, నీరు ద్వారా కూడా జంతువుల నుంచి సోకే అవకాశం అధికం. ఈ జునొటిక్ వ్యాధులు ముఖ్యంగా క్షీరద జాతి జంతువుల నుంచి మనుషులకు సోకుతాయి.
పరోక్షంగా సంక్రమిస్తున్న చర్మవ్యాధులు
సుమారు 150 జునోటిక్ వ్యాధులు గుర్తించిన దృష్ట్యా ఇది అంతర్జాతీయ సమస్యగానే అన్ని ప్రపంచ దేశాలు పరిగణిస్తున్నాయి. ఆహారోత్పత్తుల రవాణా, జంతువుల చర్మాలు, ఎముకల ద్వారా తయారవుతున్న వివిధ రకాల ఉత్పత్తులైన బెల్టులు, గొంగళ్లు, ష్వెట్టర్లు, జర్కిన్లు వంటి చలి దుస్తులు, పాద రక్షలు లాంటి వాటి ద్వారా అన్ని దేశాలకు అన్ని రకాల ఈ జంతు సంబంధిత వ్యాధులు పరోక్షంగా జొరబడుతున్నాయి. రేబిస్, బ్రూసెల్లోసిస్, మెదడు వాపు వ్యాది, ఎంటమీబా, డెంగ్యూ, ఎకినోకోకస్, చాగాస్ వ్యాధి, చికెన్ గున్యా, ప్లేగు వ్యాధి, లెప్టొస్పైరా ఇతర ఫంగల్ వ్యాధులు జునోటిక్ వ్యాధులుగా చెప్పుకొవచ్చు. వీటిలో రేబిస్ వ్యాధి అత్యంత ప్రాణాంతకమైంది. కుక్కల కాటు ద్వారా మనుషులకు చేరే ఈ వ్యాధిని పూర్తి స్థాయిలో ఏ దేశం కూడా నివారించలేకపోయింది. జంతువుల నుంచి రకరకాల చర్మవ్యాధులు కూడా మనుషులకు సోకుతున్నందున అప్రమత్తంగా ఉండాలన్నది నిపుణుల సూచన.