తెలంగాణ

telangana

ETV Bharat / city

22 ప్రభుత్వ పాఠశాలల్లో 'సున్నా' ఫలితాలు.. బాధ్యులెవరు? - SSC Zero Results in 22 Govt Schools

SSC Zero Results in 22 Govt Schools in AP : ఏపీలో.. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు అన్నారు..! మరి.. ఫలితాలు నాడు అలా ఎందుకున్నాయి..? నేడు ఇలా ఎందుకొచ్చాయి.? అసలు బాధ్యత ఎవరిది..? టీచర్లను నియమించని ప్రభుత్వానిదా.? సదుపాయాలు లేకపోయినా.. బడుల్ని అప్‌గ్రేడ్ చేసి పదోతరగతి ప్రారంభించిన అధికారులదా..? టీచర్ల కొరత ఉన్నా ఒక్కో బడిలో అన్ని సబ్జెక్టులూ బోధించిన ఇద్దరు ముగ్గురు మాస్టార్లదా..

SSC Zero Results in 22 Govt Schools
SSC Zero Results in 22 Govt Schools

By

Published : Jun 11, 2022, 8:51 AM IST

SSC Zero Results in 22 Govt Schools in AP : ఏపీ పదో తరగతి ఫలితాల్లో ఈసారి 22 ప్రభుత్వ బడుల్లో సున్నా ఫలితాలు వచ్చాయి. దీనికి బాధ్యత ఎవరిది? ఉపాధ్యాయులను నియమించకుండా విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిన ప్రభుత్వానిదా? పిల్లలను ప్రభుత్వ బడులకు పంపిన తల్లిదండ్రులదా? సదుపాయాలు లేకపోయినా పాఠశాలలను ఉన్నతీకరించి పదోతరగతి ప్రారంభించిన అధికారులదా? ఎయిడెడ్‌, ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలవి కలిపి రాష్ట్రంలో సున్నా ఫలితాలు వచ్చిన పాఠశాలలు 71. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన బోధన అందించకపోవడం, పర్యవేక్షణ లేకపోవడం ఈ ఫలితాలకు దారితీసింది.

మౌలిక సదుపాయాల పేరుతో ‘నాడు-నేడు’ పనులు, 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలించడంపైనే ఉన్నతాధికారులు దృష్టిపెట్టారు. క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయుల కొరత, పిల్లల అభ్యసన సామర్థ్యాలను గాలికొదిలేశారు. 2018లో ఒక్కరూ ఉత్తీర్ణులు కాని ప్రభుత్వబడులు 5 ఉండగా.. 2019లో ఒక్కటీ లేదు. ఈసారి ఈ సంఖ్య ఏకంగా 22కు పెరిగింది. చాలాచోట్ల ఉపాధ్యాయులు లేకపోవడమే ప్రధాన కారణంగా నిలుస్తోంది. ప్రాథమికోన్నత బడులను ఉన్నత పాఠశాలలుగా ఉన్నతీకరించినా వీటికి ఉపాధ్యాయులను నియమించలేదు. రాష్ట్రవ్యాప్తంగా 500 పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులే లేరు. ఇలాంటిచోట బోధన పర్యవేక్షణ ఎలా సాధ్యం? పరీక్షలు ఉంటాయో, లేదో తెలియక జనవరి వరకు కొన్ని పాఠశాలల్లో ఫలితాల సాధనకు ప్రణాళికనే రూపొందించలేదు. ప్రత్యేక తరగతులు పెట్టలేదు. ఇవన్నీ సున్నా ఫలితాలకు కారణమే.

5 తరగతులకు ఇద్దరు ఉపాధ్యాయులు! :కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం డేగులహాలు ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన 10 మంది విద్యార్థుల్లో ఒక్కరూ ఉత్తీర్ణులు కాలేదు. ఈ పాఠశాలను 2017లో ఉన్నతీకరించారు. ఇక్కడ ఆంగ్లం, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులే ఉన్నారు. 6-10 తరగతులకు వీరే బోధించారు. ఇదే జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్‌లో 19మంది పరీక్ష రాయగా అందరూ ఫెయిలయ్యారు. ఇక్కడ ఆంగ్లం, తెలుగు, సామాన్య శాస్త్రాలకే ఉపాధ్యాయులు ఉండగా.. మార్చి నుంచి సామాన్య శాస్త్రం ఉపాధ్యాయుడు దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. దీంతో మిగిలిన ఇద్దరే అన్ని సబ్జెక్టులకూ పాఠాలు చెప్పారు.

  • వైయస్‌ఆర్‌ జిల్లా నందలూరు మండలం లేబాక జడ్పీ ఉన్నత పాఠశాలలో పరీక్షలు రాసిన 15మందీ ఫెయిలయ్యారు. వీరిలో 14మంది తప్పింది సాంఘిక శాస్త్రంలోనే! సిద్ధవటం మండలం పి.కొత్తకోటలో 11మంది పరీక్షలకు హాజరు కాగా.. ఒక్కరూ పాస్‌ కాలేదు.

అనంతలోనే అత్యధికం.. :పది ఫలితాల్లో అట్టడుగున నిలిచిన అనంతపురం జిల్లాలో సున్నా ఫలితాలు వచ్చిన బడులు ఎక్కువ. ఇక్కడ సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. దాదాపు ప్రతి పాఠశాలలోనూ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేరు. జిల్లాలో 12 ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కరూ ఉత్తీర్ణులవ్వలేదు. అనేక పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేరు. తాత్కాలికంగా సర్దుబాటు చేసినా పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు లేరు. ఉన్నతాధికారులు ఎంతసేపూ ‘నాడు-నేడు’ పనులు, యాప్‌లలో వివరాల నమోదుకు ప్రాధాన్యం ఇచ్చారే తప్ప తరగతి గదిలో ఏం జరుగుతోందనే దానిపై దృష్టిపెట్టలేదు. మారుమూల పాఠశాలల్లో కొందరు ఉపాధ్యాయులు సక్రమంగా విధులకు వెళ్లకపోవడంతో విద్యార్థులకు పాఠాలు సరిగా సాగలేదు. 44 రోజుల ప్రత్యేక కార్యాచరణ రూపొందించినా ఇది సక్రమంగా అమలుకాలేదు.

  • పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం కండ్లకుంట జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి 21మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. ఒక్కరూ ఉత్తీర్ణులు కాలేదు. ఈ పాఠశాల మారుమూల ప్రాంతంలో ఉంది. బదిలీపై ఇక్కడికి వెళ్లినవారు తిరిగి డిప్యూటేషన్లపై వచ్చేయటంతో టీచర్ల కొరత నెలకొంది. ఆ ప్రాంతంలో ఉండే ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి బోధనకు చర్యలు తీసుకున్నా ఫలితాలు రాలేదు.
  • కృష్ణాజిల్లా మోపిదేవి మండలం వెంకటాపురం జడ్పీ పాఠశాలలో 15మంది పరీక్షకు హాజరుకాగా.. సున్నా ఫలితాలు వచ్చాయి. పదేళ్లు పాఠశాలకు వచ్చిన తర్వాత కూడా తెలుగులో పదాలు రాయలేని పరిస్థితుల్లో ఇక్కడ విద్యార్థులున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details