No Budget For Amaravati : ఏపీ రాజధాని అమరావతిపై హైకోర్టు ఆదేశాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కింది. బడ్జెట్‌లో అమరావతికి చేసిన కేటాయింపులు చూస్తే హైకోర్టు చెబితే మేం వినేదేంటనే వైఖరి ప్రదర్శించింది. రాజధానిలో నెల రోజుల్లో మౌలిక వసతుల నిర్మాణం పూర్తి చేయాలని.. 3 నెలల్లో రైతులకు లేఅవుట్‌లు అభివృద్ధి చేసి స్థలాలు అప్పగించాలనిహైకోర్టు తీర్పు ఇచ్చింది. మాస్టర్‌ప్లాన్‌ను అనుసరించి 6 నెలల్లో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలనీ ప్రభుత్వానికి విస్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అధికారంలోకి రాగానే అమరావతి పనులు నిలిపివేసిన ప్రభుత్వం.. కోర్టు తీర్పు తర్వాత కూడా తీరు మార్చుకోలేదు. అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధికి 2022-23 వార్షిక బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడమే దీనికి నిదర్శనం. బడ్డెట్ అంకెల్లో మాత్రం 1329.21 కోట్లు కేటాయించినట్టుగా చూపించి కనికట్టు చేసింది. అందులో 800 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయంగా వస్తుందని ఊహించి పెట్టింది.
No Allocations For Amaravati in Budget : బడ్జెట్ కేటాయింపుల్లో సీఆర్డీఏకి సాయం పేరుతో రూ. 200 కోట్లు కేటాయించింది. అది పూర్తిగా గతంలో రాజధాని నిర్మాణం కోసం హడ్కో, ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీలు, అసలు చెల్లించేందుకు ఉద్దేశించింది. వడ్డీలు, అసలు చెల్లించడానికీ ఆ నిధులు కూడా సరిపోని పరిస్థితి. 2021-22 బడ్జెట్‌లో సవరించిన అంచనాల ప్రకారం రుణాలపై వడ్డీలు, అసలు చెల్లించేందుకు సంవత్సరానికి రూ. 550 కోట్లు కావాలి. కానీ బడ్జెట్‌లో రూ. 200 కోట్లే చూపించారు. 'రాజధాని ప్రాంత సామాజిక భద్రతా నిధి ’ పేరుతో మరో రూ. 121.11 కోట్లు ప్రతిపాదించారు.