EDUCATION SYSTEM IN AP: 2019 డిసెంబర్ 13న ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సీఎం జగన్ చెప్పిన మాటలివి. ఆ పలుకులు పలికి మూడేళ్లవుతున్నా.. తలదించుకునే పరిస్థితి ఏమాత్రం మారలేదు. అధ్యాపక పోస్టులు భర్తీ చేయడం మాట అటుంచి, విద్యార్థులు చెల్లించిన ఫీజుల డబ్బులనూ తీసేసుకున్న ప్రభుత్వం.. వర్సిటీని నాశనం చేసింది. ఆంధ్ర వర్సిటీలో 936 పోస్టులకు గాను రెగ్యులర్ ఆచార్యులు 216 మందే ఉన్నారు. వర్సిటీకి నిధులు ఇవ్వకపోగా.. ఉన్నవాటినే రాష్ట్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్‌లో డిపాజిట్ చేయాలని లాగేసుకుంటోంది.
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిస్థితి:ఇప్పటికే కార్పరేషన్‌లో ఆంధ్ర విశ్వవిద్యాలయం 10 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసింది. మంజూరైన పోస్టులకు జీతభత్యాలు, పింఛన్లకు 366 కోట్లు, మినిమం టైమ్ స్కేల్‌లో పనిచేసేవారికి మరో 26 కోట్ల రూపాయలు కావాలి. కానీ ప్రభుత్వం అన్నింటికీ కలిపి 280 కోట్లే ఇస్తోంది. ఫలితంగా ఫీజులు, ఇతర ఆదాయం నుంచి.. వర్సిటీ ఏటా 100 కోట్లకుపైగా అదనంగా ఖర్చుచేస్తోంది. ఇలా చేస్తే భవిష్యత్తులో వర్సిటీ పరిస్థితి ఏంటి..?, ఉత్తరాంధ్రకు గుండెకాయ లాంటి విశ్వవిద్యాలయంపై చూపించే ప్రేమ ఇదేనా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
గత ప్రభుత్వం ఉత్తరాంధ్రకు ఎంతో ప్రాధాన్యం ఇస్తూ.. జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలను ఏర్పాటుచేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 7 విద్యాసంస్థలు నెలకొల్పింది. విశాఖలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-ఐఐఎం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఎనర్జీ-ఐఐపీఈ, సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, రీసెర్చ్-సమీర్‌ను తీసుకొచ్చింది. విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం, శ్రీకాకుళంలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటుచేసింది. విశ్వవిద్యాలయాలు లేని విజయనగరంలో గురజాడ వర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోగా.. సెంచూరియన్ ప్రైవేట్ వర్సిటీని ఏర్పాటుచేయించింది.
అలాగే చాలా కాలం నుంచి కొరతగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలనూ పెట్టింది. జగన్ ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్రలో పెట్టిన ముఖ్యమైన విద్యాసంస్థ ఒక్కటీ లేదు. ఉత్తరాంధ్రకు గుండెకాయ లాంటి ఆంధ్ర వర్సిటీలో అధ్యాపక పోస్టుల భర్తీని కూడా పట్టించుకోలేదు. విశాఖలో ఇంజినీరింగ్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించి మూడేళ్లు గడిచినా.. ఇప్పటికీ దాని ఊసే లేదు. గత ప్రభుత్వం విజయనగరానికి మంజూరు చేసిన గురజాడ అప్పారావు విశ్వవిద్యాలయం స్థానంలో.. జేఎన్టీయూ-గురజాడ వర్సిటీని ఏర్పాటు చేసి దాన్నే గొప్పగా చెబుతోంది.
ఐఐఎం, ఐఐపీఈ, సమీర్ లాంటి విద్యాసంస్థలతో విశాఖకు గత ప్రభుత్వం జాతీయ గుర్తింపు తీసుకొచ్చింది. అన్ని రాష్ట్రాల విద్యార్థులూ ఈ సంస్థల్లో ప్రవేశాలు పొందుతారు. హైఎండ్ నైపుణ్యాభివృద్ధి వర్సిటీ ఏర్పాటుకు గత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యార్థుల ఆలోచనలను స్టార్టప్‌లుగా మార్చేందుకు ఇన్నోవేషన్ సొసైటీ ఏర్పాటుచేసింది. అరిలోవలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పింది. ఇందులో ఉపాధి అవకాశాలను కల్పించే కోర్సులపై శిక్షణ ఇస్తున్నారు. ఆంధ్ర వర్సిటీలో ఏర్పాటుచేసిన సీమెన్స్ శిక్షణ కేంద్రంలో.. ఏడాదికి 7 వేల మందికి శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది.