YS Sharmila Unemployment Strike: ప్రజలకిచ్చిన ఏఒక్క హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోలేదని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని కొందుర్గులో ఆమె నిరుద్యోగ నిరాహార దీక్ష ప్రారంభించారు. కేసీఆర్ వెంటనే ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని ఆరోపించారు.
రాష్ట్ర మహిళా కమిషన్లో మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డిపై వైతెపా మహిళా నేతలు ఫిర్యాదు చేశారు. తమ పార్టీ అధినేత షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిరంజన్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ బుద్దభవన్‌లోని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ను కల్పనా గాయత్రి నేతృత్వంలోని ఆ పార్టీ మహిళా నేతల బృందం కలిసి వినతిపత్రం సమర్పించారు.
అంతకుముందు ఉమ్మడి మహబూబ్నగర్లో వైఎస్ షర్మిల పాదయాత్ర చేశారు. కొన్ని రోజుల క్రితం మహబూబ్ నగర్ తితిదే కళ్యాణ మండపం వద్ద 'పాలమూరు-నీళ్లపోరు' పేరిట 24 గంటల నిరాహార దీక్షను ఆమె ప్రారంభించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయలేని కేసీఆర్ నిర్లక్ష్యానికి నిరసనగా దీక్ష చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. సాకులు చెప్పకుండా వెంటనే ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వెయ్యికోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే పెండింగ్ ప్రాజెక్టుల్ని ఎందుకు పూర్తిచేయలేకపోయారని ఎదురుదాడికి దిగారు.