YS Sharmila Comments: రాష్ట్రంలో తెరాస కొనటం.. కాంగ్రెస్ నేతలు అమ్ముడుపోవటం పరిపాటిగా మారిందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన షర్మిల.. తెరాస, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ రాజులా.. కేటీఆర్ యువరాజులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన వ్యక్తికి పగ్గాలిస్తే నేతలు అమ్ముడుపోకుండా ఎందుకు ఉంటారని.. ఎద్దేవా చేశారు. తాను చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు.
గత 20రోజులుగా పండించిన పంటను కొనుగోలు చేసే నాథుడే లేక.. రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. వడ్లకు గిట్టుబాటు ధరలేక, పండించిన పంటను కొనేవాళ్లు లేక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్‌కు మహిళలు అంటే గౌరవం లేదని ఆమె ఆరోపించారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదన్నారు. ఒక మహిళా అని కూడా చూడడం లేదన్నారు. బాయిల్డ్ రైస్ కొనాలని సంతకం పెట్టమన్నది భాజపా, పెట్టింది తెరాస అని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. బాయిల్డ్ రైస్ అంశంపై ఆ రెండు పార్టీలు వ్యవహరించిన తీరు తప్పని ఆమె మండిపడ్డారు.