తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆ పార్టీ నాయకుడి ఇంటి ప్రహరీ కూల్చివేత.. 34 మందిపై కేసు నమోదు.. - చిత్తూరు తాజా వార్తలు

TDP leader house wall: తెదేపా నాయకుడి ఇంటి ప్రహరీని అధికార పార్టీ మద్దతుదారులు కూల్చివేశారు. ఏపీలోని చిత్తూరు జిల్లా రామకుప్పంలో జరిగిన ఈ ఘటనలో 34 మంది వైకాపా మద్దతుదారులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

TDP leader house wall
TDP leader house wall

By

Published : Jul 22, 2022, 12:36 PM IST

TDP leader house wall: అధికార పార్టీ మద్దతుదారులు తెదేపా నాయకుడి ఇంటి ప్రహరీ కూల్చిన సంఘటన ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కొల్లుపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు, మాజీ సర్పంచి రమేశ్‌ ఇంటి దగ్గర గ్రామస్థులు పొలాలకు వెళ్లే దారి గురించి చాలారోజుల నుంచి వివాదం ఉంది. గతంలో ఈ స్థలం విషయమై వైకాపా నాయకులు రహదారిని నిర్బంధించడంతో రమేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం రాత్రి మళ్లీ వివాదం రేగింది.

ఈ స్థలం పంచాయతీకి చెందినదని వైకాపా మద్దతుదారులు ప్రహరీ కూల్చివేశారు. ఆ స్థలం తనదేనని, ప్రహరీని ఎలా కూలుస్తారంటూ రమేశ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేయడంతో 34 మంది వైకాపా మద్దతుదారులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్థలాన్ని సర్వే చేయాలని గురువారం మధ్యాహ్నం రెవెన్యూ అధికారులు వచ్చారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా సర్వే చేస్తారని రమేశ్‌ అభ్యంతరం తెలిపారు.

రెవెన్యూ అధికారులు, పోలీసులు... రమేశ్‌ అనుచరులకు వాగ్వాదం జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా పోలీసులను గ్రామ వాలంటీరు దుర్బాషలాడినట్లు సమాచారం. కుప్పం గ్రామీణ, వి.కోట అర్బన్‌ సీఐలు సూర్యమోహనరావు, ప్రసాద్‌బాబు, రామకుప్పం, రాళ్లబూదుగూరు, వి.కోట ఎస్సైలు ఉమామహేశ్వరరెడ్డి, మునస్వామి, రాంభూపాల్‌, సిబ్బంది గ్రామంలో భారీ బందోబస్తు నిర్వహించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details