New candidates: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎన్నికలకు ఇప్పటినుంచే అభ్యర్థుల పేర్లను ఖరారు చేసుకుంటూ వెళ్లాలనే వ్యూహాన్ని.. వైకాపా అధినాయకత్వం అమలు చేస్తోంది. పార్టీలో గ్రూపుల నియంత్రణకు ఈ వ్యూహం పని చేస్తుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2019 ఎన్నికల్లో తెదేపా టికెట్‌పై గెలిచి తర్వాత వైకాపాకు మద్దతు ప్రకటించిన నలుగురు ఎమ్మెల్యేలకు వారి ప్రస్తుత స్థానాలనే కేటాయించాలని నిర్ణయించారు. వీరితో పాటు రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు అక్కడి వైకాపా సమన్వయ బాధ్యతలను అప్పగించారు. దీనిపై ఆగ్రహంతో.. అదే నియోజకవర్గంలో రెండు సార్లు వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి, ఆ పార్టీ ఇన్‌ఛార్జిగా ఉన్న బొంతు రాజేశ్వరరావు తన సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు.
ఇలాంటి అసంతృప్తులను సర్దుబాటు చేసుకునే వ్యూహంలో భాగంగా ఇప్పటి నుంచే నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నారని వైకాపా నేత ఒకరు తెలిపారు. ‘అభ్యర్థుల పేర్లను మీరే ప్రకటించి, మిగిలిన గ్రూపులకు సర్ది చెప్పండి. పార్టీ కోసం పని చేయండి. మీకూ మంచి అవకాశాలు వస్తాయని వారికి చెప్పండి’ అని ప్రాంతీయ సమన్వయకర్తలకు వైకాపా అధినాయకత్వం సూచించిందన్న చర్చ పార్టీవర్గాల్లో ఉంది.
ప్లీనరీల్లో పేర్ల ప్రకటన..‘కుప్పంలో వైకాపా అభ్యర్థిగా భరత్ పోటీ చేస్తారు, ఎమ్మెల్యే అవుతారు’ అని పలమనేరులో జరిగిన చిత్తూరు జిల్లా ప్లీనరీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు.
- ‘రాజోలులో పార్టీ సమన్వయకర్తగా ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వ్యవహరిస్తారు’ అని రాజోలు నియోజకవర్గ ప్లీనరీలో కోనసీమ జిల్లా వైకాపా అధ్యక్షుడు సతీష్ కుమార్ తెలిపారు.
- మచిలీపట్నం శాసనసభ్యుడు పేర్ని నాని కుమారుడు కృష్ణమూర్తి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే.. మీరంతా గెలిపించాలంటూ మాజీ మంత్రి కొడాలి నాని ప్లీనరీలో వైకాపా శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆయనే గన్నవరం ప్లీనరీలో.. ప్రస్తుత ఎమ్మెల్యే వల్లభనేని వంశీయే వచ్చే ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి అని ప్రకటించారు. ఆ విషయం స్వయంగా ముఖ్యమంత్రే తనకు చెప్పారని వెల్లడించారు. ఈ నియోజకవర్గంలో దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకటరావు వంశీతో విభేదిస్తూ టికెట్ రేసులో ఉన్నారు.
- ‘మూడు జిల్లాల్లో అభ్యర్థులను ఎంపిక చేసి, గెలిపించే బాధ్యతను ముఖ్యమంత్రి నాకు అప్పగించారు. కష్టపడి పని చేసే వారికే టికెట్లు’ అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా ప్లీనరీలో ప్రకటించుకున్నారు.
- విశాఖ పశ్చిమలో నిన్నటివరకూ ఇన్‌ఛార్జిగా ఉన్న మళ్ల విజయప్రసాద్ స్థానంలో మొదట శ్రీధర్‌ను అనుకున్నా అడారి ఆనంద్‌ను నియమించారు.
అక్టోబరు నాటికి స్పష్టత..సర్వే నివేదిక ఆధారంగానే అభ్యర్థులను ఖరారు చేస్తామని ఇప్పటికే ఏపీ సీఎం జగన్ ఎమ్మెల్యేలకు పలు సమావేశాల్లో స్పష్టం చేశారు. గడపగడపకు కార్యక్రమంలో చేస్తున్న సర్వే ఆధారంగా అక్టోబరు నాటికి అభ్యర్థుల పేర్లను కొలిక్కి తెస్తారన్న చర్చ నడుస్తోంది.