వైకాపా అధికారిక వెబ్సైట్లో ఉన్న ఆ పార్టీ ఎంపీల జాబితా నుంచి ఆంధ్రప్రదేశ్లోని నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజు(Raghuram Krishna Raju) పేరును తొలగించారు. రాజ్యసభ, లోక్సభకు కలిపి ఆ పార్టీ తరపున 28 మంది ఎంపీల పేర్లు గతంలో వెబ్సైట్లోని జాబితాలో పొందుపరిచారు. తిరుపతి నుంచి ఇటీవలే ఎన్నికైన గురుమూర్తి పేరును కూడా ఎంపీల జాబితాలో చేర్చారు. అయితే రఘురామకృష్ణరాజు(Raghuram Krishna Raju) పేరు ఇప్పుడు జాబితాలో లేదు. దీనిపై ఆ పార్టీ నుంచి ఎవరూ అధికారికంగా స్పందించలేదు.
ఈ రోజు నన్ను పార్టీ నుంచి బహిష్కరించారా?
'ఈ రోజు మా పార్టీ అధ్యక్షుడు నన్ను పార్టీ నుంచి బహిష్కరించారా?' అని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారిక వెబ్సైట్లో ఎంపీల జాబితాలో తనపేరు లేకపోవటంపై ఆయన ప్రకటనలో స్పందించారు. తన పార్లమెంట్ సభ్యత్వ అనర్హత అంశం తలెత్తబోదని ఆయన తెలిపారు. తనపై అనర్హత వేటు వేయాలని లోక్సభ స్పీకర్ను పార్టీ నేతలు కోరడంతో..అనేక మంది ఫోన్లు చేస్తున్నారని, సందేశాలు పంపుతున్నారని ఆయన వివరించారు. అనర్హత వేటు వేయాలని ఇప్పటికే విన్నవించారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:KTR: అద్భుత పర్యాటక ప్రాంతంగా మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి