తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఇతర రాష్ట్రాల వ్యక్తుల జోక్యం ఉండొచ్చు' - సీబీఐకి వివేకా హత్య కేసు

ఏపీ మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అంతటి క్రూరమైన హత్య జరిగి ఏడాది కావొస్తున్నా... మిస్టరీ ఇంకా వీడలేదని వ్యాఖ్యానించింది. సీబీఐ దర్యాప్తు కావాలంటూ గతంలో ఏపీ సీఎం జగన్‌ పిటిషన్‌ వేసి ఇప్పుడు దాన్ని ఉపసంహరించుకున్నారని... ఆ ప్రభావం దర్యాప్తుపై పడకూడదని తేల్చిచెప్పింది.

YS viveka murder case latest news
YS viveka murder case latest news

By

Published : Mar 12, 2020, 9:41 AM IST

'ఇతర రాష్ట్రాల వ్యక్తుల జోక్యం ఉండొచ్చు'

ఆంధ్రప్రదేశ్​ మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తును ఆ రాష్ట్ర హైకోర్టు సీబీఐకి అప్పగించింది. హత్య జరిగి ఏడాది కావొస్తున్నా ఇప్పటివరకూ సిట్‌, రాష్ట్ర పోలీసులు హంతకులను గుర్తించలేకపోయారని కోర్టు ఆక్షేపించింది. సరైన సాక్ష్యాలను సమర్పించలేకపోయారని పేర్కొంది. హత్యకు రాజకీయ కారణాలా? లేదా భూమి, ఆస్తి తగాదాలా అనే విషయాన్ని సిట్‌ ఇప్పటివరకూ తేల్చలేకపోయిందని న్యాయస్థానం తెలిపింది.

హత్య ఘటన ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాదని... ఇతర రాష్ట్రాల వ్యక్తుల జోక్యం ఉండొచ్చనే సందేహాన్ని వెలిబుచ్చింది. సుప్రీం గతంలో ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకుని కేసును సీబీఐ కి అప్పగిస్తున్నట్టు ప్రకటించింది. సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు ముగించి... తుది నివేదిక సమర్పించాలని సూచించింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను సీబీఐ కి అప్పగించాలని సిట్‌ను ఆదేశించింది.

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తు కోసం వ్యాజ్యం దాఖలు చేసిన ప్రస్తుత ఏపీ సీఎం జగన్‌... ఇటీవలే ఉపసంహరించుకున్నారని.. ఆ ప్రభావం దర్యాప్తుపై పడకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు... సిట్‌ నిర్వహిస్తున్న దర్యాప్తు మరో 2 నెలల్లో పూర్తవుతుందని... జాప్యం జరుగుతున్నందున సీబీఐ దర్యాప్తు కోరడం సరికాదంటూ అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ గతంలో వాదనలు వినిపించారు. సిట్‌ దర్యాప్తు కొనసాగింపునకు అనుమతించాలన్న అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది.

వివేకా కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ తెలుగుదేశం నేత బీటెక్‌ రవి, మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి వేసిన వ్యాజ్యాలను కోర్టు కొట్టివేసింది. వారిద్దరూ వివేకాకు రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి...ఈ కేసులో వారిని ఇరికిస్తారన్న భయంతోనే వారు వ్యాజ్యాలు దాఖలు చేశారని కోర్టు అభిప్రాయపడింది

ఇవీ చూడండి-రాష్ట్రానికి అసలు హోంమంత్రి సజ్జల: వర్ల రామయ్య

ABOUT THE AUTHOR

...view details