వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తు వేగంగా కొనసాగుతున్న తరుణంలో.. ఆయన కుమార్తె సునీత పోలీసులకు చేసిన ఫిర్యాదు కలకలం రేపుతోంది. తమ ఇంటి వద్ద ఓ అనుమానితుడు రెక్కీ నిర్వహించాడంటూ ఆమె ఏపీలోని కడప జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. ఈ నెల 10న సాయంత్రం 5 గంటల సమయంలో పులివెందులలోని తమ ఇంటి వద్ద అనుమానితుడు రెక్కీ చేశాడని ఆమె లేఖలో పేర్కొన్నారు. రెండుసార్లు బైకుపై ఇంటి వైపు వచ్చివెళ్లాడని తెలిపారు. అనుమానితుడు వివేకా ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన విషయాన్ని సీసీ కెమెరాల ద్వారా సునీత, ఆమె కుటుంబసభ్యులు గుర్తించారు. దీనిపై గురువారం పులివెందుల సీఐ భాస్కర్‌రెడ్డికి సునీత ఫిర్యాదు చేయగా..వివేకా ఇంటికి వచ్చి సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ఆ వ్యక్తిని మణికంఠారెడ్డిగా గుర్తించారు. ఇతడు వైకాపా రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి అనుచరుడిగా తేల్చారు. ఇటీవల శివశంకర్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా మణికంఠారెడ్డి పులివెందులలో భారీ ఫ్లెక్సీలు వేసినట్లు సునీత లేఖలో పేర్కొన్నారు. మణికంఠారెడ్డిని విచారించిన తర్వాత రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు తొలగించారు. ఈ విషయాలన్నింటినీ ప్రస్తావిస్తూ..సునీత శుక్రవారం కడప ఎస్పీ అన్బురాజన్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో లేఖను కార్యాలయంలో ఇచ్చి వెళ్లారు.
పోలీసు భద్రత కల్పించాలి..
వివేకా హత్య కేసులో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ప్రధాన అనుమానితుడుగా ఉన్నాడని.. ఇప్పుడు ముప్పు తలపెట్టే పనులు చేపడుతున్నాడని సునీత ఫిర్యాదులో పేర్కొన్నారు. లేఖతో పాటు సీసీటీవీ దృశ్యాలను పెన్ డ్రైవ్ ద్వారా ఎస్పీకి అందజేశారు. ఎస్పీకి రాసిన లేఖను డీఐజీ, డీజీపీతో పాటు సీబీఐ అధికారులకు కూడా పంపినట్లు లేఖలో తెలిపారు. పులివెందులలోని తమ కుటుంబానికి ఇంటి వద్ద పోలీసు భద్రత కల్పించాలని కోరారు. సునీత లేఖపై సాయంత్రం ఎస్పీ అన్బురాజన్ స్పందించారు. వివేకా ఇంటి వద్ద శాశ్వత ప్రాతిపదికన పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లేఖలో పేర్కొన్న ఇతర అంశాలపై విచారించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పులివెందుల డీఎస్పీని ఆదేశించినట్లు.. ఎస్పీ ప్రకటనలో వెల్లడించారు. పులివెందుల పోలీస్‌స్టేషన్‌లో అర్బన్ సీఐని కలిసిన సునీత ఆయనకూ లేఖ అందజేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు వివేకా ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
కొనసాగుతున్న విచారణ..