వైఎస్ వివేకాను 2019 మార్చిలో ఎవరు హత్య చేశారో కచ్చితంగా నిగ్గు తేల్చాల్సిందేనని వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు. ఇది తన మాటతో సహా జగన్, షర్మిల మాట అని.. ఇందులో మా కుటుంబంలో ఎవరికీ రెండు అభిప్రాయాలు లేవన్నారు. వివేకా హత్యపై వస్తోన్న ఆరోపనలు సహా విమర్శలపై ప్రజలకు వైఎస్ విజయమ్మ 5 పేజీల బహిరంగ లేఖ రాశారు. వివేకాను హత్య చేసిన వారు ఎంతటి వారైనా చట్టం ముందు శిక్షించాలన్నదే సునీత డిమాండ్ చేస్తున్నారని.. మా కుటుంబంలోని ప్రతి ఒక్కరి అభిప్రాయం కూడా ఇదేనన్నారు. ఈ విషయంలో మా అందరి మద్దతు సునీతకు ఉంటుందన్నారు.
' వైఎస్ కుటుంబమే లక్ష్యంగా '
బాబాయి హత్యకేసయినా కేంద్రం దర్యాప్తు చేస్తుంటే జగన్ బాబు చేయగలిగింది ఏముంటుందని విజయమ్మ లేఖలో ప్రశ్నించారు. తెదేపా సహా.. పవన్ కల్యాణ్ కూడా వైఎస్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారని విజయమ్మ మండిపడ్డారు. వైఎస్ కుటుంబంపై ఎంతగా అసత్య ప్రచారం చేసినా ప్రయోజనం ఏమీ ఉండదనే విషయాన్ని తెలుసుకోవాలని లేఖలో విజయమ్మ సూచించారు. జగన్ సహా వైఎస్ కుటుంబంపై అసత్య ప్రచారాలు చేయడం తగదన్నారు.
'
కేంద్ర సంస్థలు దర్యాప్తు చేస్తుంటే విమర్శలా ? '
చంద్రబాబు సీఎంగా ఉండగానే వైఎస్ వివేక హత్య జరిగిందని.. హత్యలో అప్పటి మంత్రి ఆదినారాయణ రెడ్డి పాత్రపై అనేక అనుమానాలున్నాయన్నారు. ఇప్పుడు భాజపాలో ఉన్న ఆయన్ను పక్కన పెట్టుకుని పవన్ విమర్శలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ విచారిస్తుందని.. హత్య కేసు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని తెలిసీ జగన్పై విమర్శలు చేస్తున్నారన్నారు. సీబీఐ విచారణ వేగంగా చేయాలని సీఎం జగన్ కూడా కేంద్రానికి లేఖ రాసినట్లు ఆమె గుర్తు చేశారు.
నివాళులు అర్పించకుండా..
వివేకానందరెడ్డి వర్దంతికి నివాళులు అర్పించకుండా ఎవరో అడ్డుకున్నట్లు ప్రచారం చేస్తున్నారని.. నిజానికి ఆ సందర్భంలో హాజరుకావాల్సిందిగా జగనే తనకు చెప్పారన్నారు. ఇలాంటి సందర్భాల్లో వెళ్లవద్దనే సంస్కారాలు మా ఇంటావంటా లేవని విజయమ్మ వివరించారు.