తెలంగాణ

telangana

ETV Bharat / city

YSRTP:నేడే వైఎస్​ షర్మిల పార్టీ ప్రకటన.. సర్వం సిద్ధం

తెలంగాణ గడ్డపై మరో రాజకీయ పార్టీ ఆవిర్భవిస్తోంది. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్​ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్​ షర్మిల.. ఇవాళ తన రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ పేరుతో జెండా, అజెండాను ఇవాళ సాయంత్రం వెల్లడించనున్నారు.

By

Published : Jul 8, 2021, 5:32 AM IST

YSRTP PARTY
YS SHARMILA PARTY

నేడే వైఎస్​ షర్మిల పార్టీ ప్రకటన.. సర్వం సిద్ధం

రాజన్న సంక్షేమ పాలన తీసుకు రావడమే ధ్యేయమంటూ.. తెలంగాణ రాజకీయాల్లో షర్మిల రంగ ప్రవేశం చేశారు. వైఎస్​ రాజశేఖరరెడ్డి తెలంగాణ పార్టీని( YSRTP) ఇవాళ ప్రకటించనున్నారు. ముందుగా ఏపీలోని కడప జిల్లా ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద పార్టీ జెండాను ఉంచి ప్రార్థనలు చేస్తారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం బేగంపేటకు చేరుకుంటారు. తెలంగాణ సంప్రదాయాలకు అనుగుణంగా సాంస్కృతిక ప్రదర్శనలతో కళాకారులు ఆమెకు స్వాగతం పలికేందుకు శ్రేణులు ఏర్పాట్లు చేశాయి.

షర్మిల వెంట..

పంజాగుట్టలోని వైఎస్‌ విగ్రహానికి పూలమాల వేసి సాయంత్రానికి రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్‌ కేంద్రానికి చేరుకుంటారు షర్మిల. ఐదు గంటలకు వేదికపైన తెలంగాణ అమరవీరుల స్తూపానికి, వైఎస్​ విగ్రహానికి నివాళి అర్పించి పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. పార్టీ స్థాపన లక్ష్యాలు, అజెండాపై సుమారు గంటకు పైగా ప్రసంగిస్తారు. తల్లి వైఎస్‌ విజయమ్మ, భర్త అనిల్‌కుమార్, కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

భారీ ఏర్పాట్లు..

ఇప్పటి వరకు కోర్‌ టీంగా ఉన్న కొండా రాఘవరెడ్డి, పిట్ట రాంరెడ్డి, తూడి దేవేందర్‌రెడ్డి సభావేదికపై నుంచి జెండా ఆవిష్కరణలో పాలుపంచుకోనున్నారు. ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. వైఎస్​ఆర్​టీపీ (YSRTP) ఆవిర్భావ కార్యక్రమాన్ని యూట్యూబ్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక కూడా తెలంగాణలో ప్రజలు సంతోషంగా లేరని షర్మిల ప్రధాన అనుచరుడు కొండా రాఘవరెడ్డి అన్నారు. షర్మిలతోనే విభిన్న వర్గాలకు అన్ని విధాలా న్యాయం జరుగుతుందని తెలిపారు.

పార్టీ ప్రారంభోత్సవానికి అన్ని పార్టీల అధ్యక్షులను, కుల సంఘాలను, మేధావులను, ఏ పార్టీతో సంబంధం లేకుండా న్యూట్రల్​గా ఉన్నవారిని సైతం ఆహ్వానించామని రాఘవరెడ్డి తెలిపారు. సాయంత్రం 5 గంటలకు వైఎస్ షర్మిల.. కొత్త పార్టీ ప్రకటన చేయనున్నట్లు వైఎస్ తెలంగాణ పార్టీ అడహక్ కమిటీ సభ్యులు వెల్లడించారు.

ఇవీచూడండి:Revanth Reddy: 'మీరే ఏకే 47 తూటాలు... సమష్టి పోరాటంతోనే అధికారం'

ABOUT THE AUTHOR

...view details