నిరుద్యోగ సమస్యలపై ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద వైఎస్ షర్మిల చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్ష ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఆమె దీక్ష చేయనున్నారు. తొలుత మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తానంటూ ఖమ్మంలో జరిగిన సంకల్ప సభలో షర్మిల ప్రకటించినా.. కొవిడ్ విజృంభణ దృష్యా కేవలం ఒక్కరోజుకే పోలీసులు అనుమతిచ్చారు.
ఖమ్మం జిల్లాలో ఇటీవల నిర్వహించిన సంకల్ప సభలో నిరుద్యోగుల సమస్యలపై పోరాడనున్నట్లు షర్మిల ప్రకటించారు. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడం వల్ల పలువురు బలవన్మరణం చేసుకున్నారని... కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో లక్షా 90 వేలకు పైగా ఉన్న ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసి... నిరుద్యోగులకు న్యాయం చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.