తెలంగాణ

telangana

ETV Bharat / city

లోటస్‌పాండ్‌లో దీక్ష కొనసాగిస్తున్న వైఎస్‌ షర్మిల - ys sharmila hunger strike news

నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ.. వైఎస్​ షర్మిల చేపట్టిన ఉద్యోగ దీక్ష రెండో రోజుకు చేరింది. వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. ప్రాణం పోయినా మంచినీళ్లు కూడా ముట్టుకోనని.... 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానని తేల్చిచెప్పారు.

ys sharmila hunger strike
లోటస్‌పాండ్‌లో దీక్ష కొనసాగిస్తున్న వైఎస్‌ షర్మిల

By

Published : Apr 16, 2021, 8:18 AM IST

Updated : Apr 16, 2021, 10:51 AM IST

లోటస్‌పాండ్‌లో వైఎస్​ షర్మిల తన రెండోరోజు 'ఉద్యోగ దీక్ష'ను కొనసాగిస్తున్నారు. షర్మిలకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. దీక్ష చేస్తున్న షర్మిలను వైఎస్ విజయమ్మ పరామర్శించారు. జులై 8న పార్టీని ఏర్పాటు చేయబోతున్నానని షర్మిల ప్రకటించారు. ఆ రోజున రాష్ట్రంలో పాదయాత్ర చేస్తానని పేర్కొన్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

ఉద్రిక్త పరిస్థితులు..

నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ.. హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద వైఎస్​ షర్మిల.. గురువారం 'ఉద్యోగదీక్ష' చేపట్టారు. సామాజిక వేత్త కంచె ఐలయ్య, బీసీ నేత ఆర్​.కృష్ణయ్య సంఘీభావం తెలిపారు. సాయంత్రం ఐదు గంటలకు గడువు ముగిసిందని.... దీక్షాస్థలిని ఖాళీ చేయాలని పోలీసులు కోరారు. లోటస్‌పాండ్‌లోనైనా దీక్ష కొనసాగిస్తానంటూ షర్మిల.. కాలినడకన తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ మీదుగా బయలుదేరారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ... పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ క్రమంలో షర్మిల అనుచరులు ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారిన దృష్ట్యా భారీగా బలగాలను రంగంలోకి దింపారు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో షర్మిల దుస్తులు స్వల్పంగా చిరిగాయి. చేతికి గాయమవటంతోపాటు కాసేపు సొమ్మసిల్లారు. షర్మిలను పోలీసులు తమ వాహనంలోనే లోటస్‌పాండ్‌ వద్దకు చేర్చారు.

అయినప్పటికీ తాను దీక్షను కొనసాగిస్తానంటూ... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రాణం పోయినా మంచినీళ్లు కూడా ముట్టుకోనని.... 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానని తేల్చిచెప్పారు. తనపై చేయి వేస్తే ఊరుకునేది లేదని పోలీసులను హెచ్చరించారు. ఏదో ఒకరోజు తాను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని వైఎస్ షర్మిల‌ ధీమా వ్యక్తం చేశారు.

ఇవీచూడండి:ఆత్మహత్యలు చేసుకోవద్దు.. నిరుద్యోగుల కోసం పోరాడతా:షర్మిల

Last Updated : Apr 16, 2021, 10:51 AM IST

ABOUT THE AUTHOR

...view details