పదేళ్ల వయసులో రెండు చేతులు కోల్పోయింది. అప్పటిదాకా స్నేహితులతో ఆడుతూ.. తోటి వారితో కలిసి బడికి వెళ్తూ ఆనందంగా గడిపింది. అకస్మాత్తుగా ఓ రోజు జరిగిన ప్రమాదం.. ఆమెను అవిటిదాన్ని చేసింది. ఆడుతూపాడుతూ సంతోషంగా గడపాల్సిన ఆ చిన్నారి జీవితాన్ని చీకటిపాలు చేసింది. ఆ బాలికది చిన్న వయసే అయినా గుండె ధైర్యం మాత్రం పెద్దది. చేతులు పోయాయని ఏడుస్తూ కూర్చోలేదు. స్నేహితులతో కలిసి ఆడుకోలేనని కుంగిపోలేదు. ఆ ప్రమాదం తన నుంచి తీసుకెళ్లింది చేతులు మాత్రమేనని గ్రహించింది. చేతులు లేకపోయినా.. తన జీవితం ఇంకా తన అధీనంలోనే ఉందని అర్థం చేసుకుంది. మొక్కవోని ధైర్యంతో ముందడుగేసింది. ఎన్నో కష్టాలను, ఇబ్బందులు ఎదురైనా చిరునవ్వుతో అధిగమించింది. కష్టపడి చదివి డిగ్రీ పూర్తి చేసింది. కేవలం చదువుతో మాత్రమే ఆపలేదు. చేతుల్లేకున్న నోటితో చిత్రలేఖనం నేర్చుకుంది. అందులోనూ రాణించింది. ఇంతకీ ఆ యువతి గాథ ఏంటంటే..?
ఈ చిత్రంలో కనిపిస్తున్న యువతి పేరు కొవ్వాడ స్వప్నిక.. 20 ఏళ్ల క్రితం శ్రీకాకుళం నుంచి ఆమె కుటుంబం హైదరాబాద్‌కు వలస వచ్చింది. పదేళ్ల ప్రాయంలో స్వప్నిక విద్యుదాఘాతానికి గురికావటంతో ఆమె రెండు చేతులూ తొలగించాల్సి వచ్చింది. అయినా.. ఆమె కుంగిపోలేదు.. చదువును ఆపలేదు. కష్టాలకు ఎదురొడ్డింది.. డిగ్రీ పూర్తిచేసింది. చేతుల్లేకున్నా నోటి సాయంతోనే చిత్రలేఖనం నేర్చుకుంది. అంచెలంచెలుగా అందులో రాణించింది. 2013లో జాతీయ స్థాయి డ్రాయింగ్ పోటీల్లో మొదటి బహుమతి సాధించింది. ఆటల పైనా దృష్టిపెట్టింది. 2019లో విజయవాడలో రాష్ట్రస్థాయి వికలాంగుల క్రీడల పోటీల్లో పరుగులో ప్రథమ, లాంగ్ జంప్‌లో ద్వితీయ స్థానాలు కైవసం చేసుకుంది. చిన్నాచితకా సమస్యలకే కుంగిపోయి ఆత్మహత్యాయత్నాలు చేసే యువతలో స్థైర్యం నింపటం ఆమెకు ఇష్టమైన వ్యాపకం.. అలాంటి సమావేశాలకు హాజరవుతూ ఉంటుంది. చేతులే లేని నేనే ఇన్ని సాధిస్తుంటే.. అన్నీ ఉండి మీరు చెయ్యలేనిదేముంటుంది..అంటూ వారిలో స్ఫూర్తిని రగిలిస్తుంది. ప్రస్తుతం సొంతూరులో బ్యాంగిల్ స్టోర్ నిర్వహిస్తూ తీరిక సమయాన్ని తన అభిరుచులు మెరుగుపరచుకునేందుకు వినియోగిస్తోందీ ధీశాలి.