- 'మా అబ్బాయి ఈమధ్య ఏదో కొత్త పదార్థం తీసుకుంటున్నాడు.. దాదాపు పదిగంటలకు పైగా నిద్రమత్తులోనే ఉంటున్నాడు. ఏంటని ప్రశ్నిస్తే తనకేం తెలియదని బదులిస్తున్నాడు. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి అలవాట్లు ఉండేవి కావు..' రాచకొండ పోలీస్ ప్రత్యేక టీంకు ఓ కొడుకు గురించి తండ్రి ఫిర్యాదు.
- నగరంలోని ఓ ప్రముఖ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని ఫోన్‌ని చూసిన తల్లికి.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్న ఫొటోలు, కొత్త వ్యక్తులతో చేసే అసభ్యకర చాటింగ్‌తోపాటు, తనకు గంజాయి సేవించే అలవాటూ ఉందని తెలిసింది. ఇదేంటని మందలిస్తే కోపంతో అన్నం తినడం మానేసింది ఆ అమ్మాయి..
- 18 ఏళ్ల కుర్రాడు. లాక్‌డౌన్‌లో తొలి వారంరోజులు బాగానే ఉన్నాడు. ఉన్నట్టుండి కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం మొదలైంది. గమనించిన తల్లి అతన్ని ప్రశ్నించగా.. తనకు గంజాయి లేకపోతే ఊపిరాడనట్లవుతోందంటూ బోరుమన్నాడు.. దీంతో అతన్ని సముదాయించి మానసిక వైద్యుని దగ్గరికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు.
ఈ మూడే కాదు.. నగరంలో ఇలాంటి ఘటనలెన్నో.. కరోనా వల్ల తల్లిదండ్రులకు వారి పిల్లల చెడు వ్యసనాలు, వ్యవహారాలన్నీ ప్రత్యక్షంగా గమనించే అవకాశం వచ్చింది. అయితే లాక్‌డౌన్ వల్లే కొందరిలో ఈ ప్రవర్తన వచ్చిందనే భావనతో మానసిక నిపుణుల్ని సంప్రదిస్తుండగా.. ఇది ఇప్పటిది కాదు గతం నుంచే ఉన్నా గుట్టుగా జరుగుతుందనే విషయం తెలిసి అవాక్కై ఆందోళన వ్యక్తం చేయడం తల్లిదండ్రుల వంతవుతోంది. తమ వద్దకు వచ్చే కేసుల్లో 17-21 ఏళ్ల వయసున్న వారిలో కొత్త మార్పుల్ని గమనించామంటూ వచ్చేవే ఇప్పుడు ఎక్కువయ్యాయంటున్నారు నిపుణులు. అయితే ఇది మంచికే అని.. వారిని మంచి దారిలోకి తెచ్చుకునే సమయం కూడా ఇదేనని చెబుతున్నారు మానసిక వైద్య నిపుణులు.
తట్టుకోలేక తెగిస్తున్నారు..
లాక్‌డౌన్ మొదలైన వారందాకా ఇలాంటి పిల్లల్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వ్యసనాలకు దూరంగా ఉండలేక బయటపడుతున్నారు. వీరిలో గంజాయి, సిగరెట్లు అలవాటు ఉన్నవారు ఇంటికే తెచ్చుకునేందుకు తెగిస్తున్నారు. నీలిచిత్రాలు లాంటివాటికి అలవాటు పడిన అమ్మాయిలు, అబ్బాయిలు ఏకాంతం కోరుకుంటూ ఇంట్లోవాళ్లపై కోపం ప్రదర్శిస్తున్నారు. వీరిలో 20 శాతం మాత్రమే లాక్‌డౌన్ ఒత్తిడిలో వీటికి బానిసలవుతుండగా.. మిగతా 80 శాతం మందికి గతం నుంచే ఈ అలవాట్లున్నాయని చెబుతున్నారు నిపుణులు.