SUICIDE : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆన్‌లైన్ రుణ యాప్‌ల వేధింపులకు మరొకరు బలయ్యారు. ఏపీలోని పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన శివ గత రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను ఆన్‌లైన్‌లో రుణయాప్ సంస్థ నుంచి 3 వేల రూపాయలు అప్పుగా తీసుకుని, ఇప్పటివరకు 20 వేల రూపాయల వరకు చెల్లించాడని మృతుని తల్లిదండ్రులు చెబుతున్నారు. అయినా ఇంకా అప్పు ఉందని కట్టకపోతే కుటుంబాన్ని రోడ్డుమీదకు లాగుతామని బెదిరించారని ఆరోపించారు. వారి వేధింపులు భరించలేకే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిన్న రాజమండ్రిలో..ఆంధ్రాలోనిఅల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం లబ్బర్తికి చెందిన కొల్లి దుర్గారావు పదేళ్ల కిందట జీవనోపాధి నిమిత్తం రాజమహేంద్రవరం వచ్చాడు. ఆరేళ్ల కిందట రమ్యలక్ష్మితో వివాహమైంది. నగరంలోని శాంతినగర్‌లో నివాసముంటున్నారు. వీరికి తేజస్వి నాగసాయి(4), లిఖితశ్రీ(2) ఇద్దరు సంతానం. దుర్గారావు పెయింటింగ్, రమ్యలక్ష్మి టైలరింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇటీవల వీరు రెండు ఆన్‌లైన్ రుణయాప్‌లలో కొంత మొత్తం నగదు అప్పుగా పొందారు. వాటిని నిర్ణీత సమయంలో చెల్లించకపోవడంతో యాప్‌ల నిర్వాహకుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. వారి బెదిరింపులను తాళలేక కొంత మొత్తం నగదును చెల్లించారు.