ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ముప్పు పొంచి ఉంటోంది. నిత్యం మాస్కులు, శానిటైజర్లు వాడుతున్నా ఏ చిన్న పొరబాటు ఆసరాగానో సోకుతోంది.. కరోనా వైరస్. ఇలాంటి స్థితిలో నిత్యం ప్రజల్లోనే ఉంటూ, వారి బాధలు పాలకులకు చేరవేస్తున్న జర్నలిస్టులు పెద్ద ఎత్తున కరోనా బారినపడుతున్నారు.
కరోనా కోరల్లో పాత్రికేయులు అండగా.. యంగ్ జర్నో
కరోనా సోకిన జర్నలిస్టుల్లో ఇప్పటికే కొందరు ప్రాణాలు కోల్పోగా... వాళ్లతో ఏళ్లుగా కలిసి పనిచేస్తున్న వాళ్లు తీవ్ర విషాదంలో కూరుకుపోతున్నారు. ముఖ్యంగా భాగ్యనగర పరిధిలో కేసుల సంఖ్య అధికంగా ఉంది. అందుకే ఈ పరిస్థితులు దగ్గరగా గమనించిన యువ జర్నలిస్టులు యంగ్ జర్నో పేరిట... ఒకరికొకరు అండగా నిలిచేందుకు నిర్ణయించారు.
80 మంది సభ్యులతో..
సిద్దార్థ, మహేందర్ రెడ్డి.. నేతృత్వంతో వివిధ ఛానళ్లు, పత్రికల్లో పనిచేసే జర్నలిస్టుల్లో ఎవరు వైరస్ బారినపడినా తక్షణ సాయం అందిస్తున్నారు. మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు సహా పండ్లు, డ్రై ఫ్రూట్లు కలిపి... కిట్‌గా అందిస్తున్నారు. ప్రారంభంలో ఐదారుగురు తమ దగ్గరున్న కొద్ది మొత్తంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత మరింత మంది తోడు కావడంతో.. ఇప్పుడు 80 మందికి పైగా సభ్యులతో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
బాధితుల్లో ఆత్మస్థైర్యం..
బాధిత జర్నలిస్టుల సమాచారం సేకరించేందుకు.. ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది.. యంగ్ జర్నో. కరోనా సోకిన జర్నలిస్టులు... వారి వివరాలను తెలిపితే వారుండే చోటకే నేరుగా వెళ్లి కిట్ అందిస్తున్నారు. ప్రారంభంలో రోజుకు ఐదారు కిట్లే పంపిణీ చేయగా... నేడు 20 నుంచి 25 కిట్ల వరకు అందిస్తున్నారు. ఆపదలో మేమున్నాం అంటు చేసే చిన్న సాయం... బాధిత జర్నలిస్టుల్లో ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తుందంటున్నారు.
సీనియర్ల సపోర్ట్..
ఈ ఆపత్కాలంలో నిరుపేదలైన జర్నలిస్టుల బాగోగులూ చూస్తున్నారు.... యంగ్ జర్నో సభ్యులు. అవసరంలో ఉన్న వాళ్లకు నిత్యవసర సరకులు అందిస్తూ... అండగా నిలుస్తున్నారు. ఈ యువకుల సేవలకు మెచ్చిన... సీనియర్ జర్నలిస్టులు, కొంత మంది రాజకీయ నాయకులు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు.
హైదరాబాద్ వరకే..
పరిమిత వనరుల కారణంగా యంగ్ జర్నో సేవలు.. ప్రస్తుతానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కొనసాగుతున్నాయి. అవకాశం లభిస్తే.... జిల్లాల్లోనూ ఇలాంటి సేవలు చేసేందుకు ప్రయత్నిస్తామని చెబుతున్నారు ఈ బృంద సభ్యులు. ఓ వైపు ప్రజలకు, ప్రభుత్వాలుకు మధ్య వారధుల్లా పనిచేస్తూనే.. తోటి వారికి సేవ చేయడంలో సంతృప్తిని కలుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబ సభ్యుల్లో ఆందోళనలు, భయాలు ఉన్నా.... వృత్తి ధర్మం కోసం బయటకు వస్తున్నామంటున్న జర్నలిస్టులు.. ప్రజలు ఎవరు అనవసరంగా బయటకు రావొద్దని పిలుపునిస్తున్నారు.