ఆ దంపతులకు ఆమె మొదటి సంతానం. అన్నప్రాసన అప్పుడు ఆమె ముట్టుకుంది సంగీత వాద్యమే. అప్పటి నుంచి ఆమెకు సంగీతంతో స్నేహం మొదలైంది. పెరుగుతున్న కొద్దీ ఆ స్నేహం ప్రేమగా మారింది. ఆ ప్రేమ నిరంతరం ఆమెను సంగీత సాధన చేసేలా ప్రేరేపించింది. బడి నుంచి ఇంటికొచ్చింది మొదలు ఆ ఇంట్లో వాళ్లకి కోయిల గొంతుతో కమ్మని అమృతాన్ని పంచేది. కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు.. టీవీ చూడటమో, వీడియోగేమ్స్ ఆడటమో చేయకుండా... ఇంట్లోని వ్యర్థాలతో అద్భుతమైన కళాకృతులు తయారుచేసేది. తమ చిన్నారి ప్రతిభను చూసిన ఆ తల్లిదండ్రులు ఆమెకు నచ్చిన రంగంలోనే ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు.
అప్పటి నుంచి ఆమె సంగీతసాధన(music practice)కు వాళ్లవంతు కృషి చేయడం మొదలుపెట్టారు. కన్నవాళ్ల ప్రోత్సాహంతో ఆ చిన్నారి ఎంతో ఆనందంగా సాధన చేయడం ప్రారంభించింది. వాళ్ల ప్రోద్బలంతో తాను కచ్చితంగా గొప్ప సింగర్‌ని అవుతానని కలలు కన్నది. అంతా సవ్యంగా జరిగితే అది జీవితం ఎలా అవుతుంది. ఈ కుటుంబాన్ని చూసి కాలం కన్నెర్ర చేసింది. అద్భుత ప్రతిభ.. అందమైన గొంతు కలిగిన ఆ అమ్మాయిని క్యాన్సర్ మహమ్మారి ఆవహించింది.
తమ బిడ్డను గొప్ప సింగర్(singer)ను చేయాలని అహోరాత్రులు కష్టపడుతున్న ఆ తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి ఎంతో బాధపడ్డారు. తమ చిన్నారిని కాపాడుకోవడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఆమెకు క్యాన్సర్ చికిత్స అందజేస్తూనే.. తను ధైర్యం కోల్పోకుండా తనతో పాటలు పాడిస్తున్నారు. చివరి నిమిషం వరకు తమ చిన్నారి బతుకుపై ఆశలు కోల్పోకుండా ఆ కన్నవాళ్లు కష్టపడుతుంటే... తాను బతుకున్నంత వరకు తన నోట పాటను బతికిస్తూనే ఉంటానని ఆ బాలిక నిశ్చయించుకుంది.
ఏడాదిగా ప్రాణాంతకమైన క్యాన్సర్(Girl diagnosed with cancer)తో పోరాడుతున్న ఆ బాలిక పేరు లక్ష్మీ మనోజ్ఞ(14). పాటలు పాడటం, కళాకృతులను తయారు చేయడంలో ఆమె దిట్ట. బుధవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలుగు, హిందీ, ఆంగ్లం, సింహళి, కొరియన్ భాషల్లో ఏకధాటిగా అరగంటకు పైగా (2,021 సెకన్ల పాటు) వివిధ గీతాలను ఆలపించి ‘వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. తిరుపతికి చెందిన నరసింహా, తేజోవతి దంపతుల పెద్దమ్మాయి అయిన లక్ష్మీమనోజ్ఞ సంగీతంతో పాటు వ్యర్థాలతో అద్భుతమైన కళాకృతులను తయారు చేయడంలో దిట్ట.
ఏడాది కిందట అనారోగ్యం బారినపడటంతో వైద్యులను సంప్రదించగా.. పరీక్షలు జరిపి క్యాన్సర్ అని నిర్ధారించారు. ఎలాగైనా బిడ్డను కాపాడుకోవాలని తల్లిదండ్రులు తమ జీవనాధారమైన చిరు వ్యాపారాన్ని కూడా వదులుకున్నారు. హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఏడాదిగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి(Basavatarakam cancer hospital)లో చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ప్రతిభకు గుర్తింపు లభించేలా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్(Wonder book of records) కోసం ప్రయత్నం చేశారు. శ్రీరాజమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మయూరి ఆర్ట్స్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.