తెలంగాణ

telangana

ETV Bharat / city

ఇది టాటా మెచ్చిన స్టార్టప్..‌! - యువ వ్యాపారావేత్త అర్జున్​ దేశ్​పాండే

ఒక చిన్న ఆలోచన ఆ అబ్బాయి జీవితాన్ని మార్చేసింది. పరిచయం అక్కర్లేని పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా మెప్పును తెచ్చిపెట్టింది. ఆయన చేత పెట్టుబడులు సైతం పెట్టించింది. ఇంతకీ ఎవరా అబ్బాయి... ఏం చేసి టాటాను మెప్పించాడో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

Young Businessman Arjun deshpande latest news
Young Businessman Arjun deshpande latest news

By

Published : Jun 14, 2020, 11:36 PM IST

అతని వయసు చిన్నదైనా మనసు పెద్దది. పేదలకు ఆరోగ్యాన్ని పంచడమే ధ్యేయంగా వారికి తక్కువ ధరకే ఔషధాలు అందించాలనుకున్నాడు మహారాష్ట్రకు చెందిన పద్దెనిమిదేళ్ల అర్జున్​ దేశ్​పాండే.

ఇంటర్‌ చదువుతూనే 15 లక్షల పెట్టుబడితో ‘జనరిక్‌ ఆధార్‌- అగ్రిగేటర్‌’ పేరుతో ఓ స్టార్టప్‌ను ప్రారంభించి మురికివాడల్లో ఫార్మసీలను ఏర్పాటు చేశాడు అర్జున్​ దేశ్​పాండే. వాటి ద్వారా మందుల్ని బయట దుకాణాల్లో అమ్మే మార్జిన్‌ రేటు కంటే ఎనభై శాతం తక్కువ ధరకి అమ్మడం మొదలుపెట్టాడు. అలా అతని మెడికల్‌ దుకాణాల్ని పేదల ఫార్మసీగా మార్చేశాడు. థానేతో పాటు క్రమంగా పుణె, ముంబయి, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లోనూ వాటిని పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చాడు.

రతన్‌ టాటా ఫోన్​...

రోడ్డు పక్కల ఉండేవారికి ఉచితంగానే మందులు ఇచ్చేవాడు. ఎప్పుడూ పేదల కోసమే ఆలోచించే అర్జున్‌ గురించి ఆ నోటా ఈ నోటా తెలుసుకున్న రతన్‌ టాటా ఆ కుర్రాణ్ని అభినందించకుండా ఉండలేకపోయారు. అలా ఒకరోజు అర్జున్‌కి ఫోన్‌ చేసి ‘నేను చేయలేని పని నువ్వు చేస్తున్నావు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాక్కూడా నీతో కలిసి పనిచేయాలనుంది. కానీ అది కుదరదు కాబట్టి నీ స్టార్టప్‌లో నేను పెట్టుబడులు పెడదామనుకుంటున్నా నీకు అభ్యంతరం లేకపోతే’ అన్నారాయన. ఒక్క క్షణం ఉలిక్కిపడ్డట్టైంది అర్జున్‌కి. ఆ వెంటనే తేరుకుని రతన్‌ ఒప్పందానికి మనస్ఫూర్తిగా అర్జున్​ అంగీకారం తెలిపాడు.

తల్లి వెంట విదేశాలకు....

మనదేశంలో ఫార్మా సంస్థలు అపారంగా ఉన్నాయి. విదేశాలకు సైతం భారీగానే ఔషధాలు సరఫరా చేసే శక్తి భారత్‌ సొంతం. అలాంటిది మనదేశంలో దాదాపు అరవై శాతం ప్రజలు ఔషధాలను కొనుక్కోలేకపోతున్నారు. ఆ విషయాన్ని గమనించిన అర్జున్‌ ఏదైనా చేయాలనుకున్నాడు. థానేకి చెందిన అర్జున్‌ తల్లి ఓ ఫార్మా సంస్థలో ఉన్నతస్థాయి ఉద్యోగిని. తరచూ దేశ విదేశాలకు వెళుతుంటుంది. అలా ఆమె వెంట వియత్నాం, చైనా, అమెరికా వంటి దేశాలకు వెళ్లినప్పుడు ఫార్మా రంగం, ఔషధాల అమ్మకానికి సంబంధించి చిన్నపాటి అధ్యయనం చేస్తే అక్కడ మెడిసిన్స్‌ చౌకగా దొరుకుతున్నాయని అతనికి అర్థమైంది.

మన దగ్గర చిన్న చిన్న సమస్యలకి వాడే మందుల ధరలు కూడా కొండెక్కి కూర్చుంటున్నాయి. ఫార్మా సంస్థల్లో తయారైన ఔషధాలు వినియోగదారులకి చేరే క్రమంలో అవి పలు చేతులు మారడమే ధరల పెరుగుదలకి అసలు కారణమని గుర్తించాడు. దాంతో ఔషధాలను ఫార్మా సంస్థల నుంచే నేరుగా తెచ్చి వినియోగదారులకు అందిస్తే వారిపై భారం ఉండదని ఆలోచించాడు. అప్పటికి అర్జున్‌ ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్నాడు. తల్లిదండ్రులకు ఆ విషయమే చెబితే వెంటనే ఒప్పుకుని స్టార్టప్‌ ఏర్పాటుకు రూ.15 లక్షల పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. దాంతో అర్జున్‌ తన దుకాణానికి ఔషధాలు పంపమని చాలా ఫార్మా సంస్థలతో మాట్లాడాడు. మొదట ఏ సంస్థా అందుకు ఒప్పుకోలేదు. చిన్న కుర్రాడు... ఉడుకు రక్తంతో ఏదో చేయాలనుకుంటున్నాడని తేలిగ్గా తీసుకున్నాయి. కొందరైతే ‘నిజంగానే పేదలకే ఇస్తావా ఈ మందులు’ అని అనుమానిస్తూ మాట్లాడేవారు.

ఏడాది కష్టపడి...

ఏది ఏమైనా అర్జున్‌ వదలకుండా ఆ సంస్థల చుట్టూ తిరుగుతుండేవాడు. పలు స్థాయిల్లోని అధికారులను కలిసి తన ఆలోచన చెబుతుండేవాడు. ఆ సంస్థలకి మెయిళ్లు పెట్టేవాడు, లెటర్లు రాసేవాడు. అలా దాదాపు ఏడాదిపాటు అదే పనిలో ఉన్నాడు. చివరికి గతేడాది ఓ ఆరు ఫార్మా సంస్థలు అర్జున్‌ పట్టుదలను మెచ్చుకుని ఔషధాలు నేరుగా తక్కువ ధరకే సరఫరా చేయడానికి ఒప్పుకున్నాయి. అలా ‘జనరిక్‌ ఆధార్‌’ పేరుతో ఏడాది క్రితం ఒక ఫార్మసీతో మొదలుపెట్టి... ఇప్పటి వరకూ 35 బ్రాంచీలు ఏర్పాటు చేశాడు. వాటి ద్వారా తక్కువ ధరకే ఔషధాలు అందించడం మొదలుపెట్టాడు. పైగా ఈ ఫార్మసీలను మురికివాడలకు దగ్గరగా పెట్టడం వల్ల పేదలు లబ్ధిపొందుతున్నారు. పేదలకు మేలు జరగడం వల్ల రతన్‌ టాటా కూడా స్పందించారు.

థియల్‌ ఫౌండేషన్‌ ఫెలోషిప్పునకు ఎంపిక...

ప్రస్తుతం టాటా పెట్టుబడులతో మరిన్ని శాఖల్ని విస్తరించే పనిలో ఉన్న అర్జున్‌ భవిష్యత్‌లో తన ఫార్మసీల్లో క్యాన్సర్‌ డ్రగ్‌ను కూడా అందుబాటులో ఉంచడానికి సిద్ధమయ్యాడు. సరికొత్త ఆలోచనలు చేసే యువతను ప్రోత్సహించడానికి ఫెలోషిప్పుల రూపంలో లక్ష డాలర్లు అందించే థియల్‌ ఫౌండేషన్‌ ఫెలోషిప్పునకు అర్జున్‌ ఎంపిక కావడం విశేషం.

For All Latest Updates

TAGGED:

eenadu

ABOUT THE AUTHOR

...view details