రమ రోజూ పొద్దున్నే మామగారి కోసం ఇడ్లీ వేస్తుంది. ఇంట్లో మిగిలినవారందరి కోసం దోసెలో చపాతీలో చేస్తుంది. పదేళ్ల కొడుక్కి మాత్రం ఆ టిఫిన్లేవీ పనికిరావు. నూడుల్స్ చేయమంటాడు. ఒకవేళ పొద్దున్న నచ్చజెప్పి బలవంతంగా ఏ దోసెలో తినిపించినా సాయంత్రం మళ్లీ నూడుల్స్ చేయాల్సిందే. అవి కాకుండా ప్యాకెట్లకు ప్యాకెట్లు చిప్సూ పరపరలాడిస్తుంటాడు. ‘చిప్స్‌ని ఆలుగడ్డతోనేగా చేస్తారు, ఎదిగే పిల్లాడికి కార్బోహైడ్రేట్లు మంచిదేలే’ అనుకుంటుంది రమ. ఇక, కాలేజీకి వెళ్లే కూతురికి శాండ్‌విచ్‌లూ బర్గర్లూ కావాలి. వాళ్లాయనేమో వారానికి రెండు సార్లయినా పిజ్జాలు ఆన్‌లైన్లో ఆర్డరిచ్చి తెప్పిస్తుంటాడు.
ఇవాళా రేపూ పిండివంటలు ఇంట్లో చేసే తీరికెక్కడ... అందుకే సాయంకాలం చిరుతిళ్ల కోసం బూందీ మిక్చర్, భుజియా, వేయించిన పల్లీలూ కార్న్‌ఫ్లేక్సూ లాంటివి రెడీమేడ్‌వి కొనుక్కొచ్చి పెడుతుంది రమ. సరుకులు తేవడానికి సూపర్‌మార్కెట్‌కి వెళ్తే సగానికి పైగా ఖర్చు ఫుడ్ ప్యాకెట్లదే. ఓ రోజు ఆమెతో పాటు షాపింగ్‌కి వచ్చిన స్నేహితురాలు రమ కొంటున్న ప్యాకెట్లు చూసి ఆశ్చర్యపోయింది. ‘ఇంత జంక్‌ఫుడ్ తింటారా మీరు’ అన్న స్నేహితురాలి ప్రశ్న రమని ఆలోచనలో పడేసింది. ‘ధాన్యాలూ, పప్పుదినుసులూ, కూరగాయలూ వాడి తయారుచేసే ఆహారపదార్థాలని జంక్‌ఫుడ్ అంటుందేమిటీ’... అనుకుంది. తీరిక చేసుకుని న్యూట్రిషనిస్టు అయిన మరో స్నేహితురాలి దగ్గరికి వెళ్లి తన సందేహాలన్నీ ఆమె ముందు పెట్టింది.
జంక్‌ఫుడ్ అని దేన్ని అంటాం?
పనికొచ్చే పోషకాలు తక్కువగా ఉండి, శరీరానికి హాని చేసే పదార్థాలైన కొవ్వులూ ఉప్పూ చక్కెరా లాంటివి ఎక్కువుంటే వాటిని జంక్‌ఫుడ్ అంటాం. చిప్సూ రకరకాల స్నాక్సూ మిఠాయిలూ శీతల పానీయాలూ బర్గర్లూ పిజ్జాలూ లాంటివన్నీ జంక్‌ఫుడ్ కిందికే వస్తాయి. వీటిలో కెలొరీలు ఎక్కువ. శరీరానికి అవసరమైన పీచు, మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజాలు తక్కువ.
కొన్నిట్లో కూరగాయలు ఉంటాయిగా?
అవడానికి కూరగాయలూ చికెనూ లాంటివే కానీ వాటిని రుచికరంగా, మళ్లీ మళ్లీ తినాలనిపించేలా తయారుచేయడానికి వాడే అదనపు పదార్థాల వల్ల ఎక్కువ అనర్థం జరుగుతుంది. చాలా రకాల జంక్‌ఫుడ్‌ని మనం టిఫిన్ లాగానో, స్నాక్స్ లాగానో తింటాం కానీ నిజానికి రోజు మొత్తం మీద తీసుకోవాల్సిన కెలొరీల్లో ఎక్కువ భాగం వాటినుంచే వచ్చేస్తాయి. ఆ తర్వాత మళ్లీ మామూలుగా ఆహారం తీసుకోవడం వల్ల కెలొరీలు ఎక్కువైపోయి కొవ్వు పేరుకుపోయి క్రమంగా స్థూలకాయానికీ పలు అనారోగ్యాలకీ దారితీస్తుంది. ఇటీవల సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ అనే పరిశోధనా సంస్థ మార్కెట్లో ఎక్కువ ప్రజాదరణ పొందిన ఆహారపదార్థాలను తమ ప్రయోగశాలలో పరీక్షించి చూసి ఒక నివేదిక వెలువరించింది. మంచివే అని మనం అనుకుంటున్న ఎన్నో పదార్థాల బండారాన్ని బయటపెట్టింది.
ఎలాంటి పదార్థాలని పరీక్షించారు?
చిప్సూ నూడుల్సూ రకరకాల స్నాక్సూ(నమ్‌కీన్) బర్గర్లూ శాండ్‌విచ్‌లూ పిజ్జాలూ సూపులూ... ఇలాంటి మొత్తం 33 రకాల రెడీమేడ్ ఆహార పదార్థాల్ని విశ్లేషించి చూశారు. అవన్నీ పిల్లలూ పెద్దలూ ఇష్టంగా తినేవే.
ఏమున్నాయి వాటిల్లో?
చాలా వాటిల్లో ఉప్పు ఎక్కువగా ఉంది. కొన్నిట్లో కొవ్వు ఉంది. మరికొన్నిట్లో ట్రాన్స్‌ఫ్యాట్... కొన్నిట్లో మూడూ ఉన్నాయి. ఇవేవీ ఆరోగ్యానికి మంచిది కాదు.
రుచికోసం వేసే ఉప్పూ ఎక్కువేనా?
రుచికోసమే వేస్తారు నిజమే. కానీ అది ఎంత అనేది మనం తినే పదార్థం సైజుని బట్టి ఉంటుంది. రోజు మొత్తంమీద తీసుకోవాల్సిన ఉప్పు మొత్తమో మూడొంతులో ఒక్క స్నాక్స్ ప్యాకెట్‌లోనే ఉండేసరికి రోజంతా భోజనంలోనూ ఇతర పదార్థాల్లోనూ తినేది అదనం అయిపోతోంది.
ఎంత ఎక్కువేమిటీ?
ముప్ఫై గ్రాముల చిప్స్ ప్యాకెట్లో 2 నుంచి 4 గ్రాముల ఉప్పు ఉంది. రెండు నుంచి ఆరుగ్రాముల కొవ్వు ఉంది. ఆకుకూర, ఆలుగడ్డ... దేంతో తయారుచేసినా వాటివల్ల వచ్చే పోషకాలకన్నా ఈ ఉప్పూ కొవ్వుల వల్ల వచ్చే నష్టం ఎక్కువ. పిల్లలు ఇష్టంగా తినే ఇన్‌స్టంట్ నూడుల్స్‌లోనూ రెండున్నర గ్రాముల ఉప్పు ఉంటోంది. రోజు మొత్తం తినాల్సిన మూడు గ్రాముల్లో రెండున్నర గ్రాములు ఇందులోనే ఉంటే ఇక కూరల్లో, టిఫిన్లలో తినేది అంతా కలిపితే చాలా ఎక్కువవుతుంది. వానాకాలం, చలికాలం ఇన్‌స్టంట్ సూప్‌లకు బాగా గిరాకీ. కూరగాయల సూప్‌లే కదా అని రోజూ తాగేస్తున్నట్టయితే దాంతో పాటు ఒక గ్రాముకు పైగా ఉప్పు కూడా తీసుకుంటున్నట్లు లెక్కేసుకోవాలి. ఆ మేరకు మిగతా పదార్థాల్లో ఉప్పు తగ్గించుకోవాలి. కానీ మనకా విషయం తెలియదు కాబట్టి మామూలుగా తినేస్తాం.
అలాగే ఏ షాపింగ్‌కో వెళ్లి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో బర్గర్లూ ఫ్రైలూ కలిపిన కాంబో లాగించారంటే అందులో 103శాతం ఉప్పు, 72శాతం కొవ్వు, 13 శాతం ట్రాన్స్‌ఫ్యాట్, 33శాతం పిండిపదార్థాలూ ఆరోజుకి ఎక్కువగా తిన్నట్టే. పైన కూరగాయల ముక్కలతో ఆకర్షణీయంగా కన్పించే పిజ్జా ఆరోగ్యానికి మంచిదేనని చాలామంది నమ్ముతారు. కానీ అందులో ఉప్పూ కొవ్వులతో పాటు ట్రాన్స్‌ఫ్యాట్ కూడా పెద్దమొత్తంలో ఉంటుంది. అలాగే శాండ్‌విచ్‌లు కూడా. గోధుమ పిండితో చేసిన బ్రెడ్డూ మధ్యలో కూరగాయ ముక్కలూ లేదా చికెనూ అన్నీ మంచివేగా అనుకుంటారు. కానీ 5గ్రా.ఉప్పూ, 39గ్రా.కొవ్వూ, 0.62గ్రా.ట్రాన్స్‌ఫ్యాట్... చికెన్ సీక్ కబాబ్ శాండ్‌విచ్‌లో ఉన్నాయిట. అంటే అలాంటి శాండ్‌విచ్ ఒకటి తింటే ఆ రోజుకి ఇక ఉప్పు ఎందులోనూ తీసుకోకూడదు. శాకాహారమూ తక్కువ కాదు. పన్నీర్ టిక్కా శాండ్‌విచ్‌లోనూ రోజులో తీసుకోవాల్సిన ఉప్పూ కొవ్వూ మూడొంతులు ఉంటున్నాయట. పిజ్జాలూ బర్గర్లూ అమ్మే చాలా కంపెనీలు వాటిల్లో ఉండే ట్రాన్స్‌ఫ్యాట్ల గురించి చెప్పడం లేదు. అవే కాదు, పేస్ట్రీలూ కుకీల్లాంటి వాటిల్లో కూడా ఉండే ఈ ట్రాన్స్‌ఫ్యాట్లు(అసంతృప్త కొవ్వు) ఎక్కువైతే గుండెజబ్బులు వస్తాయి.
ఎంత ఉప్పు తినొచ్చు?
ఉప్పు అంటే 40శాతం సోడియం, 60శాతం క్లోరైడ్‌ల మిశ్రమం. శరీరంలో నీరూ ఖనిజాల సమతుల్యత సాధించడానికి ఇది కొంత మొత్తం అవసరం. పెద్దవాళ్లు రోజు మొత్తమ్మీద ఐదు గ్రాములు అంటే- దాదాపు ఒక టీస్పూను ఉప్పు తీసుకోవచ్చు. అదే బీపీ ఎక్కువగా ఉండేవాళ్లకి ఒకటిన్నర గ్రాము- అంటే పావు టీస్పూను- చాలట. ఆరేళ్లలోపు పిల్లలకు మూడు గ్రాములు సరిపోతుంది. కానీ మనం అవసరమైనదానికన్నా మూడు రెట్లు ఎక్కువగా తీసుకుంటున్నామని అధ్యయనాలు చెబుతున్నాయి. జంక్‌ఫుడ్ అందుకు ప్రధాన కారణం.
పదార్థాల్లోని ఉప్పూ చక్కెరల్లాంటి వాటి సరైన వివరాలను చాలా కంపెనీలు ప్యాకెట్ మీద ప్రచురించడం లేదు. కొన్నయితే తప్పు దోవ పట్టించేలా ఉంటున్నాయి. అలాగే పదార్థాల సైజు కూడా ముఖ్యమైన విషయమే. ఉదాహరణకు- ప్లేటు ఇడ్లీ అంటే మూడు ఇడ్లీలని లెక్క. అలాగే చిప్స్ 30గ్రాముల ప్యాకెట్ ఒకసారి తినొచ్చు. కానీ కంపెనీలేమో అంతకన్నా పెద్ద ప్యాకెట్లని తయారుచేస్తాయి. సగం తిని మిగిలినవి దాచినా మెత్తబడిపోతాయి కాబట్టి మొత్తం తినేస్తారు. దాంతో తినాల్సిన దానికన్నా ఎక్కువ ఒకేసారి తినేయడం వల్ల అదే నిష్పత్తిలో ఎక్కువ ఉప్పు కూడా శరీరంలోకి వెళ్తోంది.
ఎక్కువ తింటే ఏమవుతుంది?
ఆహారపదార్థాల్లో ఉప్పు ఎక్కువైతే వెంటనే కన్పించే ప్రభావం- తీవ్రమైన దాహమూ కడుపుబ్బరమూ. మన మూత్రపిండాలు సోడియం-నీరు నిష్పత్తిని తగినంత ఉండేలా చూసుకుంటూ ఉంటాయి, ఎప్పుడైతే ఉప్పు ఎక్కువవుతుందో అప్పుడు దానికి తగినట్లుగా అవి నీటినీ అట్టిపెట్టుకోడానికి ప్రయత్నిస్తాయి. దాంతో చేతులూ కాళ్లూ ఉబ్బి, బరువు పెరిగినట్లు అనిపిస్తుంది. బీపీ కూడా పెరుగుతుంది. తగినంత నీరు తీసుకోకపోతే శరీరంలో సోడియం సురక్షిత స్థాయిని దాటి పెరగడం వల్ల హైపర్‌నాట్రీమియా అనే సమస్య ఎదురవుతుంది.
ఎక్కువైన సోడియాన్ని పలచన చేయడానికి కణాలనుంచీ నీరు రక్తంలో కలుస్తుంది. ఈ పరిస్థితికి వెంటనే చికిత్స చేయకపోతే ఫిట్స్, కోమాలోకి వెళ్లిపోవటం లాంటి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. ఉప్పు విషయంలో శరీరం స్పందించే తీరుకు జన్యుపరమైన, హార్మోన్ల ప్రభావమూ కారణమవుతుంది. దీర్ఘకాలం ఉప్పు ఎక్కువగా తీసుకుంటే బీపీ, కడుపుకు సంబంధించిన క్యాన్సర్లూ గుండెజబ్బులూ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
అసలివి ఎంతుండాలి?
ప్రపంచ ఆరోగ్య సంస్థ, జాతీయ పోషకాహార సంస్థ, ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ... నిపుణుల సిఫార్సులు మన రోజువారీ ఆహారంలో ఉప్పు 5గ్రా., కొవ్వు 60గ్రా., పిండి పదార్థాలు 300గ్రా. ట్రాన్స్‌ఫ్యాట్ 2.2గ్రాములు మించకూడదంటున్నాయి. వీటిని మనం తీసుకునే భోజనమూ, టిఫిన్లూ, చిరుతిళ్లలోకి వాటాలుగా విడదీస్తే ఒకోదాంట్లో ఎంతుండాలో తెలుస్తుంది.
ఎక్కువ తింటే ఏమవుతుంది?
జంక్‌ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల స్థూలకాయమూ దాంతో వచ్చే బీపీ షుగరూ గుండెజబ్బులూ క్యాన్సర్లే కాదు, ఇంకా చాలా నష్టాలున్నాయి.
అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో వచ్చిన పరిశోధన ప్రకారం- జంక్‌ఫుడ్ ఎక్కువగా తినే పిల్లల్లో మెదడు బలహీనమై జ్ఞాపకశక్తీ, నేర్చుకునే సామర్థ్యమూ తగ్గిపోతున్నాయి.
చిన్న వయసులోనే బీపీ, గుండె జబ్బులూ పెరుగుతున్నాయి.