ఏపీలో అధికారంలోకి వచ్చాక చేపడుతున్న తొలి ప్లీనరీని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు వైకాపా సిద్ధమైంది. శుక్ర, శనివారాల్లో రెండు రోజులపాటు గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న స్థలంలో ప్లీనరీ నిర్వహించనున్నారు. తొలి రోజు లక్ష మంది, రెండోరోజు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రసంగ సమయానికి 3 నుంచి 4 లక్షల మంది హాజరయ్యేలా జన సమీకరణకు వైకాపా నాయకత్వం కసరత్తు చేస్తోంది. పార్టీ నియమావళిలో సవరణనూ ప్లీనరీ వేదికగా చేయనున్నారు. పార్టీ గౌరవాధ్యక్ష పదవిని రద్దు చేయడం, సంస్థాగత నిర్మాణంలో మార్పులు వంటివి ఆ సవరణల్లో ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. సవరణ ఏమిటనే కచ్చితమైన సమాచారం బయటకు రావడం లేదు.
ప్లీనరీలో సుమారు 10 రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. పార్టీ కమిటీలను జగన్ ప్రకటించనున్నారు. రెండోరోజు సాయంత్రం జగన్‌ను పార్టీ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నుకోనున్నారు. తర్వాత ఆయన వైకాపా అధ్యక్షుడి హోదాలో సాయంత్రం 4 గంటలకు ప్లీనరీ ముగింపు ప్రసంగం చేయనున్నారు. వచ్చే ఎన్నికలకు వైకాపా కార్యాచరణను, పార్టీ విధాన నిర్ణయాలనూ ఆయన ప్రకటించనున్నారు. ప్లీనరీ వేదికకు వైఎస్సార్ ప్రాంగణం అని నామకరణం చేశారు. సీఎంతోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్మన్లు, మేయర్లు ఇలా సుమారు 400 మంది వరకు కూర్చునేలా వేదికను సిద్ధం చేస్తున్నారు. రెండు రోజులు కలిపి సుమారు మూడున్నర లక్షల మందికి భోజనాలు తయారుచేస్తున్నారు. 25 టన్నుల తాపేశ్వరం కాజాలను తెప్పిస్తున్నారు.
తొలి రోజు షెడ్యూల్ ఇదీ..
శుక్రవారం ఉదయం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ముఖ్యమంత్రి జగన్ ప్లీనరీని ప్రారంభించనున్నారు. తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి ముఖ్యమంత్రి, ఇతర నేతలు నివాళులర్పిస్తారు. అనంతరం పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను ప్రకటించనున్నారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి ప్రారంభోపన్యాసం చేస్తారు. తొలి రోజు 5 తీర్మానాలు చేయనున్నారు. శనివారం ఉదయం పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సందేశమిస్తారని షెడ్యూల్‌లో పొందుపరిచారు. సాయంత్రం ముఖ్యమంత్రి జగన్ గంటన్నర పైగా ప్రసంగించనున్నారు.