తెలంగాణ

telangana

ETV Bharat / city

VIJAYA SAI REDDY: 'ఏపీతో పాటు ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌లకు ప్రత్యేక హోదా ఇవ్వండి'

రాష్ట్ర విభజన సమయంలో రాజధానులను కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌లకు పదేళ్ల పాటు ప్రత్యేకహోదా ఇవ్వాలని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వాణిజ్యశాఖ పార్లమెంటరీ స్థాయిసంఘం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. విజయసాయి శనివారం ఈ నివేదికను వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడికి అందించారు.

ycp-parliamentary-leader-vijaya-saireddy-request-to-give-special-status-for-ap

By

Published : Sep 12, 2021, 9:50 AM IST

Updated : Sep 12, 2021, 10:08 AM IST

‘‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370ని అనుసరించి ఇదివరకు ఉన్న జమ్మూకశ్మీర్‌ రాష్ట్రం ప్రత్యేకస్థాయితో పాటు, ప్రత్యేక కేటగిరీ హోదాను అనుభవించింది. ఇప్పుడు ఆర్టికల్‌ 370, 35ఎలను రద్దు చేయడంతో పాటు... జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టడం వల్ల ఆ రాష్ట్రానికి ఇక ఏ మాత్రం ప్రత్యేక కేటగిరీ హోదా కొనసాగే అవకాశం లేదు. అయితే 2021-22 కేంద్ర బడ్జెట్‌లో జమ్మూకశ్మీర్‌కు రూ.1.08 లక్షల కోట్లు, లద్దాఖ్‌కు రూ.5,958 కోట్లు కేటాయించినట్లు వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వాణిజ్యశాఖ పార్లమెంటరీ స్థాయిసంఘం గమనించింది. భారీగా పెంచిన కేటాయింపుల వల్ల రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో తగినంత అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో రాజధానిని కోల్పోయినందున లద్దాఖ్‌కు ఎదురయ్యే ప్రతికూలతలను భర్తీ చేయడానికి వీలవుతుంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లకు 2021-22 బడ్జెట్‌లో అధిక కేటాయింపులు జరపడాన్ని కమిటీ అభినందిస్తోంది. అదే తరహాలో రాష్ట్ర విభజన సమయంలో రాజధానులను కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌లకూ ఇలాంటి పరిహారం ఇస్తే బాగుంటుందన్నది కమిటీ భావన. ఈ మూడు రాష్ట్రాలకు కనీసం పదేళ్ల పాటు ప్రత్యేక రాష్ట్ర హోదా ప్రకటించాలని కమిటీ సిఫార్సు చేస్తోంది. దాని వల్ల ఆయా రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధి, వాణిజ్యం, ఎగుమతుల మౌలిక వసతుల పరంగా ఆర్థికాభివృద్ధి చెందడానికి వీలవుతుంది...’’ అని కమిటీ పేర్కొంది.

వాల్తేర్‌ డివిజన్‌ను విడగొట్టొద్దు

కొత్తగా ఏర్పాటు చేసే దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ నుంచి వాల్తేర్‌ డివిజన్‌ను విడగొట్టరాదని ఈ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. ‘‘విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటుకు ఇప్పటికే ఆమోదముద్ర వేసినట్లు కమిటీకి అధికారులు చెప్పారు. కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటు, తూర్పుకోస్తా రైల్వే జోన్‌లో రాయగడ డివిజన్‌ ఏర్పాటుకు సంబంధించిన పనులను రూ.170 కోట్ల అంచనా వ్యయంతో 2020-21 బడ్జెట్‌లో చేర్చినట్లు తెలిపారు. డీపీఆర్‌ ఇప్పటికీ రైల్వే శాఖ పరిశీలనలో ఉందని, కొత్త జోన్‌ అమల్లోకి రావడానికి నిర్దిష్టమైన సమయం చెప్పలేమని కూడా సమాచారం అందించారు. దక్షిణ కోస్తా రైల్వే పేరుతో విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటు, దాని భౌగోళిక పరిధిని అన్ని పరిపాలనా, నిర్వహణ కోణాలతో పాటు, విభిన్న అంశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయించినట్లు చెప్పారు. డీపీఆర్‌ ఇంకా పరిశీలనా ప్రక్రియలో ఉన్నట్లు చెప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. కొత్త జోన్‌ ఏర్పాటు పక్రియను వేగవంతం చేసి అందుకు సంబంధించిన వివరాలను చర్యా నివేదిక రూపంలో కమిటీకి సమర్పించాలి. వాల్తేర్‌ డివిజన్‌ను విడదీయడం వెనక ఉన్న తర్కమేమిటో అర్థం కావడం లేదు. కొత్తగా ఏర్పాటు చేసే దక్షిణకోస్తా రైల్వే జోన్‌ను వాల్తేర్‌ డివిజన్‌ పరిధిలోకే వస్తున్నందున దాన్ని అందులోనే విలీనం చేయవచ్చు. అందువల్ల రైల్వేశాఖ వాల్తేర్‌ డివిజన్‌ను విడగొట్టాలన్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి. కొత్త జోన్‌ ఖరారై, అమల్లోకి వచ్చేంత వరకూ ఆ ప్రక్రియను వాయిదా వేయాలి...’’ అని స్థాయీ సంఘం సిఫార్సు చేసింది.

  • దేశంలో మిరప ఎగుమతులకు ప్రధాన కేంద్రంగా ఉన్న గుంటూరులో శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలని సూచించింది. ‘‘ఇక్కడి నుంచి ప్రతి నెలా 1.8 లక్షల టన్నుల మిరప ఎగుమతి అవుతుంది. అందువల్ల ఇక్కడ సాధారణ గోదాములకు బదులు తక్షణం తగిన సంఖ్యలో శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకు కేంద్ర వాణిజ్య, ఆహారశుద్ధి శాఖ తగిన చర్యలు తీసుకోవాలి...’’ అని సిఫార్సు చేసింది.

ఇదీ చూడండి:Shashi Tharoor: తెలంగాణ ఐటీ పాలసీ దేశంలోనే ఆదర్శం: శశి థరూర్

Last Updated : Sep 12, 2021, 10:08 AM IST

ABOUT THE AUTHOR

...view details