వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై సొంత పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. తితిదే ఆస్తుల వ్యవహారంతో పాటు అక్రమంగా ఇసుక తరలింపు, ప్రభుత్వ భూముల వేలం వంటి అంశాల్లో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపానని చెప్పారు. తన వ్యాఖ్యలతో పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు బాధపడినట్లు తెలిసిందన్నారు.
'వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్రమైన సిద్ధాంతం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు విమర్శలు చేస్తే... అధికార పార్టీ నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన వారితో తిట్టిస్తారు. నాపై కూడా ప్రసాద్రాజుతో విమర్శలు చేయించారు. నేను ముఖ్యమంత్రిని సమయం అడగలేదని చెబుతున్నారు. నిజానికి నేను వైకాపాలోకి వస్తాననుకోలేదు. సీటు కోసం ఎవర్నీ బతిమిలాడలేదు. నిజం చెప్పాలంటే... వారు బతిమాలిడితేనే వైకాపాలో చేరాను తప్ప నాకు నేనుగా చేరలేదు'- రఘురామకృష్ణరాజు, వైకాపా ఎంపీ
కాళ్లావేళ్లా పడితే వైకాపాలో చేరా.. నాకు నేనుగా వెళ్లలేదు: రఘురామకృష్ణరాజు
తాను నరసాపురం నుంచి పోటీ చేశాను కాబట్టే వైకాపా ఎంపీ స్థానం గెలుచుకుందని రఘురామకృష్ణరాజు అన్నారు. తాను పోటీలో ఉన్నాను కాబట్టే చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధినేతను ఉద్దేశిస్తూ పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
'ఆయన బొమ్మ చూసి గెలిచే పరిస్థితి నరసాపురంలో లేదు. నన్ను చూసే అక్కడి ప్రజలు ఓట్లు వేశారు. అలానే.. కొంత మంది గెలిచారు. ఆయన దయ వల్లపార్లమెంటరీ కమిటీ ఛైర్మన్పదవి దక్కిందని అనటం సరికాదు. నిజానికి మా పార్టీకి కేటాయించే కోటా అయిపోయినప్పటికీ గౌరవ ప్రధానమంత్రి, స్పీకర్ చొరవ వల్ల నాకు ఆ పదవి లభించింది. ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పకపోతే నాకు పదవి ఇచ్చేందుకు కృషి చేసిన వారిని అవమానపర్చినట్లే. వైకాపాలో ఎన్ని పదవులు ఏ సామాజికవర్గానికి వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి కుల రాజకీయలను ప్రయోగించొద్దు. పేరు చివరన ఆ రెండు అక్షరాలు ఉంటేనే వారికే పదవులు వస్తాయని అందరికీ తెలుసు. కొందరు కోటరీ సభ్యులు సీఎం చుట్టూ చేరి.. ఆయన్ను వివాదంలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. మా చిన్న కులంలో చిచ్చు పెట్టొద్దని.. కోటరీ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా. మా స్నేహితుడైన ప్రసాద్రాజుకు మంత్రి పదవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' -రఘురామకృష్ణరాజు, వైకాపా ఎంపీ
ఇవీచూడండి:మరో శాసన సభ్యుడికి కరోనా... ఎమ్మెల్యే గణేశ్ గుప్తాకు పాజిటివ్