ఏపీలోని విశాఖలో నలంద కిశోర్ మృతినన్ను ఎంతగానో కలచివేసిందని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. కిశోర్ పెట్టిన పోస్టుల్లో ఎవరి పేరు లేకపోయినా అరెస్టుచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యం బాగా లేకున్నా విశాఖ నుంచి కర్నూలుకు తీసుకెళ్లారని చెప్పారు. కర్నూలుకు కిశోర్‌ను తరలించిన సమయంలో అక్కడ కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని...వైరస్ బారిన పడే కిశోర్ చనిపోయారని తెలుస్తోందని వ్యాఖ్యానించారు. ఇది ముమ్మాటికీ పోలీసు హత్యగానే భావించాలని అన్నారు. పోలీసుల చర్యలతో స్నేహితుడు కిశోర్‌ను కోల్పోవడం బాధాకరమని తెలిపారు.
భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు తూట్లు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవించే హక్కును హరింపచేస్తున్నారా..? అని ప్రశ్నించారు. గతంలో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినందుకు ప్రశ్నిస్తే ప్రతిపక్ష నేతగా జగన్ విమర్శించారని గుర్తు చేశారు. పోలీసుల దమనకాండను ప్రభుత్వాధినేతగా జగన్ ఆపివేయాలని కోరారు. పోలీసుల చర్యలతో ప్రాణాలు పోయే పరిస్థితి తీసుకురావడం శోచనీయమన్నారు. సహించలేని స్థితికి వెళ్తే ప్రజలు ఎదురుతిరిగే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.