తెలంగాణ

telangana

ETV Bharat / city

Sucharitha: 'పేదల స్థలాలపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తాం.. సుప్రీంకు వెళ్తాం' - telangana news

పేదల ఇళ్లకు సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. గతంలో ఎవరూ పేదలకు ఒక్క సెంటు భూమి ఇవ్వలేదన్న ఆమె.. ఒకే గదిలో ఉంటూ అద్దె ఇళ్లలో ఇబ్బంది పడుతున్నారన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన స్థలాలపై వంకలు పెట్టడం సరికాదని అన్నారు.

ap home minister Sucharitha, ap govt homes
ఏపీ హోమంత్రి సుచరిత, ఆంధప్రదేశ్ హైకోర్టు

By

Published : Oct 9, 2021, 6:10 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల విషయంలో ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లనున్నట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా కాకుమాను, పెదనందిపాడు మండలాల్లో రెండో విడత ఆసరా చెక్కులను ఆమె పంపిణీ చేశారు. గతంలో ఎవరూ పేదలకు ఒక్క సెంటు భూమి ఇవ్వలేదని... తమ ప్రభుత్వం 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే ప్రతిపక్షాలు న్యాయస్థానాలను ఆశ్రయించి మోకాలడ్డటం బాధాకరమన్నారు. ఒకే గదిలో ఉంటూ ఎంతోమంది పేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సెంటు భూమిలో రెండు గదులు నిర్మించుకోవచ్చని అన్నారు. ప్రభుత్వ భూమిలేని ప్రాంతంలోనూ భూమిని కొనుగోలు చేసి పేదలకు ఇస్తే.. దానికి కూడా వంకలు పెట్టడం సరికాదన్నారు.

పేదల ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్తుంది. గతంలో ఎవరూ పేదలకు ఒక్క సెంటు భూమి ఇవ్వలేదు. ఒకే గదిలో ఉంటూ అద్దె ఇళ్లలో ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాలపై వంకలు పెట్టడం సరికాదు.

-మేకతోటి సుచరిత, ఏపీ హోంమంత్రి

ఏపీ హైకోర్టు తీర్పులో ఏముందంటే..

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకంలో పలు లోపాలను ఆ రాష్ట్ర హైకోర్టు ఎత్తిచూపింది. ప్రధానంగా మూడు అంశాలను కోర్టు ప్రస్తావించింది. పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలాలు సరిపోవని, ఈ విషయంలో ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయించాలని సూచించింది. ఆ ప్రక్రియ ముగిసే వరకు ఆ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టవద్దని తీర్పు చెప్పింది. మహిళల పేరుతోనే పట్టాలివ్వడం సరికాదని, అర్హులైన పురుషులు, ట్రాన్స్‌జెండర్లకూ ఇవ్వాలని చెప్పింది.

అభ్యంతరాలు స్వీకరించాలి..

ఇళ్లస్థలాల రిజిస్ట్రేషన్‌ కన్వేయన్స్‌ డీడ్‌లను రద్దు చేసి, అర్హులకు డీ-ఫాం పట్టాలు ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెనాలికి చెందిన పొదిలి శివమురళి, మరో 128 మంది గతేడాది డిసెంబరులో ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి శుక్రవారం ఈ మేరకు సంచలన తీర్పు ఇచ్చారు. ఇళ్ల స్థలాల విస్తీర్ణంపై కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఇళ్ల నిర్మాణంలో పర్యావరణ ప్రభావం, ఆరోగ్య సమస్యలు, ఇతర అంశాలపై అధ్యయనానికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలకు చెందిన ముగ్గురు నిపుణులతో నెల రోజుల్లో కమిటీ వేయాలని ఆదేశించింది. మరో నెలలో ఆ కమిటీ నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది. నివేదికను రెండు స్థానిక పత్రికల్లో ప్రచురించి.. ప్రజల అభ్యంతరాలు స్వీకరించాలని సూచించింది.

లేఅవుట్లను సవరించాలి..

ఆ తర్వాతే ఈ పథకాన్ని ఖరారు చేయాలని స్పష్టం చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా అదనపు భూమి కొని, స్థలం విస్తీర్ణం పెంచి, లబ్ధిదారులకు కేటాయించిన లేఅవుట్లను సవరించాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ ముగిసేవరకూ ఈ పథకం కింద కేటాయించిన భూముల్లో నిర్మాణాలు చేపట్టవద్దని తేల్చిచెప్పింది. ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించి ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవో 367లోని మార్గదర్శకాలు-2,3, జీవో 488లోని క్లాజ్‌ 10,11,12, జీవో 99లోని క్లాజ్‌ బీ,డీలను చట్ట విరుద్ధమైనవంటూ, వాటిని రద్దు చేసింది.

ఇదీ చదవండి:Gold seized: ఎయిర్​పోర్టులో బంగారం పట్టివేత.. ఫేస్​క్రీమ్ డబ్బాల్లో..

ABOUT THE AUTHOR

...view details