ఏపీలోని విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న పవన్.. అధికార వైకాపాపై పలు విమర్శలు గుప్పించారు. స్పందించిన వైకాపా నేతలు.. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తమదైన శైలిలో పవన్‌పై విరుచుకుపడ్డారు.
అమ్ముడుపోయిన వారు వైకాపాను విమర్శించటమేంటంటూ గుడివాడ ఎమ్మెల్యే అమర్‌నాథ్ పవన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
"కేంద్రాన్ని నిలదీయకుండా స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్న ప్రభుత్వాన్ని పవన్ విమర్శిస్తున్నారు. విశాఖ ఉక్కు నష్టాల్లో ఉందని చెబుతూ.. ప్రజలని మభ్యపెట్టి... భాజపా ఎజెండాను ఏపీలో అమలు చేయాలనే ఉద్దేశంతో చేసిన ప్రసంగం అది. తక్షణమే ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించాలని కార్మిక సంఘాలను కోరుతున్నా. ఏ పరిశ్రమలోనూ లాభాలు లేవని.. ఒక్క వైకాపా పరిశ్రమలో మాత్రమే లాభాలున్నాయని పవన్ అంటున్నారు. అటు ప్రతిపక్షంలోనూ, ఇటు అధికార పక్షంలోనూ లేకుండా అత్యధిక డబ్బులు సంపాదించిన నాయకుడు పవన్ కల్యాణ్ మాత్రమే. వివిధ రాజకీయ అవసరాల కోసం అమ్ముడుపోయిన మీరు మాట్లాడుతున్నారా?"