విశాఖను ఆంధ్రప్రదేశ్ పాలనా రాజధానిగా చేయడం ఫలితంగా... భీమిలి నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందుతుందని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వివరించారు. మధురవాడలో ఏపీ సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి ఎంపీ పాల్గొన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్రకు ముఖ్యమంత్రి మూడు రాజధానుల నిర్ణయం మేలు చేస్తుందని ఉద్ఘాటించారు.
ఆంధ్ర ప్రదేశ్కు 3 రాజధానులు ప్రకటించి... జగన్ మంచిపని చేశారని వైకాపా నేతలు కొనియాడారు. ప్రాంతీయ భేదాలు, వెనుకబాటుతనం వల్లే రాష్ట్ర విభజన జరిగిందని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ అన్నారు. భవిష్యత్తులో అలాంటి అసమానతలు తలెత్తకుండా ఉండేందుకే... 3 రాజధానుల ప్రకటన చేశారన్నారు. అభివృద్ధిని వికేంద్రీకరించేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కర్నూలులో ఏపీ హైకోర్టు ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై రాయలసీమ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.