Amaravati: రాజధాని అమరావతి కేవలం ఒక సామాజికవర్గ ప్రయోజనాల కోసమేనని వైకాపా ప్రభుత్వం, అధికార పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో దాడి చేశారు. అమరావతిలో అత్యధిక గ్రామాలున్న తాడికొండ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. ఈ ప్రాంతంలోని సామాజిక వర్గ ప్రజల వివరాలు, ప్రభుత్వానికి భూములిచ్చిన సన్న, చిన్నకారు రైతుల సమాచారం... ఐకాస నాయకులు పలు సందర్భాల్లో గణాంకాలతో సహా వివరించారు. కానీ గత ప్రభుత్వం కేవలం ఒక సామాజికవర్గం ప్రయోజనం కోసమే అక్కడ రాజధాని ఏర్పాటు చేసిందని మంత్రులు, వైకాపా నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో వేసిన అఫిడవిట్‌లలో ఆ ప్రస్తావన లేదు. వారి ఆరోపణే నిజమైతే కోర్టులో ఎందుకు ప్రస్తావించలేదు? అని హైకోర్టు ప్రశ్నించింది. అలాగే అమరావతిని శ్మశానమన్నారు. అక్కడి నేల భారీ నిర్మాణాలకు పనికిరాదని... ఇతర ప్రాంతాలతో పోలిస్తే నిర్మాణవ్యయం భారీగా ఉంటుందని ఆరోపించారు. కృష్ణా నదికి వరదలొస్తే రాజధాని మునిగిపోతుందని ప్రచారం చేశారు. కానీ కోర్టులో ఆ ప్రస్తావన తేలేదని హైకోర్టు తెలిపింది.
అమరావతిని భ్రమరావతన్న మంత్రులు..
అమరావతిని భ్రమరావతి అని మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు. అమరావతిలో పనులేమీ జరగలేదని, గత ప్రభుత్వం చూపించినవన్నీ గ్రాఫిక్సేనన్న మాటలకు.... రాజధానిలో రూ. 15 వేల కోట్ల విలువైన పనులు జరిగాయని, ఇప్పుడు రాజధానిని మార్చేస్తే అన్ని వేల కోట్ల ప్రజాధనానికి జవాబుదారీ ఎవరని హైకోర్టు ప్రశ్నతో వారిది అసత్యప్రచారమేనని తేలిపోయింది. రాజధాని భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని... ప్రభుత్వంలోని వ్యక్తులు, వారి సన్నిహితులు పెద్ద ఎత్తున భూములు కొని లబ్ధి పొందారని ప్రచారం జరిగింది. అసలు ఇన్‌సైడర్ ట్రేడింగ్ అన్నదే అక్కడ వర్తించదని హైకోర్టు ఇది వరకే స్పష్టం చేసింది. రాజధానిగా అమరావతి అనేది గత ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయమన్న కొందరి నాయకుల ప్రచారాన్ని కోర్టు తన తీర్పులో ప్రస్తావించి... అప్పటి ప్రతిపక్షనేత జగన్ సహా ఇతర నేతలు అమరావతికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని... అందరి ఏకాభిప్రాయంతో జరిగిందని కోర్టు తన తీర్పులో ప్రస్తావించింది.