తెలంగాణ

telangana

ETV Bharat / city

పోలీసుల సాక్షిగా... ప్రత్యర్థులపై దాడులు - local body elections latest news

ఆంధ్రప్రదేశ్​లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల చివరిరోజు అధికార పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ప్రత్యర్థులపై దాడులకు దిగారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. అభ్యర్థులను అపహరించి భౌతిక దాడులకు దిగారు. పోలీసుల సాక్షిగానే వైకాపా నాయకులు దాడులు చేయడం చర్చనీయాంశమైంది.

YCP cadre attack on tdp contestants
YCP cadre attack on tdp contestants

By

Published : Mar 12, 2020, 9:32 AM IST

పోలీసుల సాక్షిగా... ప్రత్యర్థులపై దాడులు

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా... ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలో వైకాపా నేతలు బరితెగించారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన తెదేపా నాయకులపై దౌర్జన్యం చేశారు. నామపత్రాలు చించివేశారు. పులివెందుల, రాయచోటి, మైదుకూరు, రైల్వేకోడూరు, కడప నియోజకవర్గాల్లో దాడులు చేశారు. చిన్నమండెం మండంలో తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్‌ పత్రాలను వైకాపా వర్గీయులు చించివేశారు. రెండోసారి నామినేషన్ వేసేందుకు రాగా దాడికి దిగారు. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు.

వీరబల్లి మండలం గడికోటలో తెదేపా ఎంపీటీసీ అభ్యర్థిని వైకాపా నేతలు అపహరించారు. రైల్వేకోడూరులో నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. తెదేపా నేత చెంగల్రాయుడుకు, వైకాపా నాయకుల మధ్య తోపులాట జరిగింది. చిన్నమండెం మండలం బోనమలలో తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ వేసినా... అధికారుల బల్లపై నుంచి లాక్కెళ్లారు. వీఎన్​పల్లి మండలం ఊరుటూరుకు చెందిన ఎంపీటీసీ అభ్యర్థి పత్రాలను వైకాపా నాయకులు తస్కరించారు. చాపాడు మండలం చియ్యపాడులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామపత్రాలను చించివేశారు.

వేంపల్లె, చక్రాయపేట, వేముల మండలాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా అధికార పార్టీ నాయకులు అడ్డుకున్నారు. ఎంపీడీవో కార్యాలయం వద్దనే గుమిగూడిన వైకాపా శ్రేణులు... బెదిరింపులకు పాల్పడ్డారు. పెండ్లిమర్రి మండలం మొయిళ్ల కాల్వకు చెందిన తెదేపా అభ్యర్థిని నామినేషన్ వేయకుండా వైకాపా నాయకులు అపహరించుకుపోయారు. తొండూరు జడ్పీటీసీ అభ్యర్థి నామపత్రాలు లాక్కుని ఆమె భర్తను అపహరించుకుపోయారు. దీన్ని నిరసిస్తూ అరుణమ్మ, తెలుగుదేశం నేతలు జిల్లాపరిషత్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

అనంతపురం జిల్లాలోనూ ఉద్రిక్తతల మధ్యే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. బత్తిలపల్లిలో తెలుగుదేశం శ్రేణులపై వైకాపా వర్గీయులు దాడికి దిగారు. తెలుగుదేశం అభ్యర్థుల నామపత్రాలను చించివేశారు. మాజీమంత్రి పరిటాల సునీత ఎస్పీకి సమాచారం ఇవ్వగా... పోలీసు బలగాలతో నామినేషన్ వేయడానికి వచ్చినప్పటికీ మరోసారి దాడికి దిగారు. మండలంలో రెండు ఎంపీటీసీ స్థానాలకు తెలుగుదేశం అభ్యర్థులు నామినేషన్ వేయలేకపోయారు. తాడిమర్రిలో జనసేన నాయకుడు చిలకం మధుసూధన్‌రెడ్డిపై వైకాపా నేతలు రాళ్లదాడికి పాల్పడ్డారు. కదిరి మండలం కౌలేపల్లిలో వైకాపా నేతకు చెందిన భవనంలో కర్ణాటకకు చెందిన 36 కేసుల మద్యం లభ్యమైంది.

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నిడిగుంటపాలెంలో భాజపా అభ్యర్థినిపై వైకాపా నాయకులు కత్తులతో దాడి చేశారు. నామినేషన్‌ వేయడానికి వీల్లేదంటూ బిరదవోలు మణెమ్మ, ఆమె అల్లుడు మణికంఠపై దౌర్జన్యానికి దిగారు. కత్తితో దాడి చెయ్యగా... మణెమ్మ చేతిపై రెండుచోట్ల గాయాలయ్యాయి. మణికంఠ తలకు తీవ్రగాయమవగా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. తెలుగుదేశం తరఫున నామినేషన్ వేయకుండా పెళ్లకూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద అధికార పార్టీ నాయకులు అడ్డుకున్నారు. అక్కడికి చేరుకున్న మాజీమంత్రి పరసారత్నంపైనా దాడికి దిగారు. ఆయన నాయుడుపేట పోలీస్​స్టేషన్ ఎదుట ధర్నా చేశారు.

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ఉప్పలపాడు ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ వేసేందుకు వెళ్తున్న జనసేన సభ్యుడు చిందుకూరి శ్రీనివాసరావుపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అతని వద్ద ఉన్న నామపత్రాలు లాక్కుని చింపివేశారు.

ఇదీ చదవండీ... పల్నాడులో కర్రలు, కత్తుల స్వైరవిహారం

ABOUT THE AUTHOR

...view details